బంజారాహిల్స్,మార్చి 15: తమ కుటుంబసభ్యులకు సన్నిహితంగా ఉంటూ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్ రోడ్ నెం 72లోని ప్రశాసన్‌నగర్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి పేరం వెంకయ్య, అతడి సతీమణి ఇందిరాదేవి నివాసం ఉంటున్నారు. వారి ఇంట్లో సంపంగి విజయ్‌కుమార్ చిన్నతనం నుంచి ఉండడంతో అతడి బాగోగులు సైతం వెంకయ్య, ఇందిరాదేవి చూస్తుండేవారు. వెంకయ్య కుమార్తెలు, కొడుకులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లిపోవడంతో అన్ని పనులకు విజయ్‌కుమార్ మీద ఆధారపడడం ప్రారంభించారు. ఇంట్లో మనిషిగా కలిసిపోవడంతో ఇందిరాదేవి అతడిని తన కొడుకు అంటూ చెప్పుకునేది.
ఇదిలా ఉండగా 2015లో వెంకయ్య మెట్లమీదనుంచి కిందపడి గాయపడడంతో అప్పటినుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. అప్పటినుంచి అన్ని పనులను విజయ్‌కుమార్ చూసుకునేవాడు. వెంకయ్య కుమార్తె మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన రాధికా రస్తోగీతో పాటు ఇతర కుటుంబసభ్యులు మొత్తం విజయ్‌కుమార్ జోక్యాన్ని వ్యతిరేకించినా ఇందిరాదేవి మద్దతు ఇవ్వడంతో వారంతా మౌనంగా ఉన్నారు. కాగా 2025 నవంబర్‌లో వెంకయ్య మరణించడం, అంత్యక్రియలు సైతం విజయ్, అతడి భార్య క్రాంతి పెత్తనం చేస్తున్నారంటూ కుమార్తె రాధికా రస్తోగీ తదితరులు గొడవకు దిగినా ఫలితం దక్కలేదు.
ఇదిలా ఉండగా ప్రశాసన్‌నగర్‌లోని ఇంటితో పాటు యూసుఫ్‌గూడలోని తిరుమల అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్‌పై సైతం విజయ్ అజమాయిషీ ఉండడం, వెంకయ్యకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు, ఆభరణాలకు సంబంధించిన వ్యవహారాల్లో అవకతవలకు పాల్పడుతున్నాడంటూ కుమార్తె రాధికా రస్తోగీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు రూ.27లక్షల మేర డబ్బు డ్రా చేశారని, సొత్తు మాయం చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు విజయ్‌కుమార్, అతడి భార్య క్రాంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.