వర్ధన్నపేట, జనవరి 12: గ్రామాల్లో ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను రక్షించాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను పూర్తిస్థాయిలో గుర్తించడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
యాసంగి సాగు ప్రారంభమైనందున వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. అలాగే, ప్రాథమిక విద్య, పశుసంవర్ధక శాఖ, విద్యుత్, వైద్యం, మిషన్ భగీరథ, మత్స్య, పంచాయతీరాజ్ శాఖలపై అధికారులు చర్చించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో చర్చించిన ప్రతి అంశాన్ని అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ సహకారం కూడా ఉంటుందన్నారు. సమావేశంలో ఎంపీడీవో రాజ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి సురేశ్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.