అరకొర వసతులు, సవాలక్ష సమస్యలతో అస్తవ్యస్తంగా ప్రభుత్వ గురుకులాలు మారాయి. సరిపడా గదులు లేక కొన్ని, ఉన్నా శిథిలమై పెచ్చులూడే తరగతులు, ఉరుస్తున్న భవనాల భయంభయంగా విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చాలాచోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, స్నానగదులు లేవు, వాటికి తలుపులు కూడా మల విసర్జనకూ బాటిళ్లు తీసుకొని ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలో పాములు, తేళ్లు వంటి విషపురుగులూ కుట్టిన సందర్భాలూ లేకపోలేదు.
ఇక వరంగల్ ఉర్సుగుట్టలోని ఎంజేపీ గురుకుల పాఠశాల, కళాశాల చదువుల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిస్తే.. సమస్యల్లో మాత్రం వెనుకే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల డ్యుయల్ డెస్కులు లేక నేలపైనే చదువులు, అద్దె గదుల్లో విద్యార్థులు అవస్థలు, అతీగతీ లేని వసతులు, పర్యవేక్షణ కరువైన విద్యార్థులు పక్కదారి పడుతున్న విషయాలు శనివారం ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ విజిట్‌లో వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా పలు గురుకులాల పరిస్థితిపై ప్రత్యేక కథనం.
– వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఆగస్టు 10 (నమస్తేతెలంగాణ)/ హనుమకొండ /నర్సంపేట/వర్ధన్నపేట/జనగామ చౌరస్తా
వరంగల్ ఉర్సుగుట్టలోని అద్దె భవనంలో నడుస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో సమస్యలు గూడుకట్టుకున్నాయి. సరిపడా గదులు, టాయిలెట్స్, డ్యూ యల్ డెస్క్‌లు లేవు. ఈ పాఠశాల, కళాశాల గత విద్యాసంవత్సరంలో రాష్ట్రస్థాయిలోనే ప్రథమస్థానంలో నిలిచినప్పటికీ సమస్యలతో సమతమవుతున్నది.
శనివారం ‘నమస్తే తెలంగాణ’ ఈ గురుకులాన్ని విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ భవనం ఖమ్మం బైపాస్‌రోడ్డు పక్కన డ్రైనేజీని ఆనుకుని ఉండడంతో దుర్వాసన వస్తుండగా, కొన్ని సందర్బాల్లో విద్యార్థినులు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఈ గురుకులంలో ఐదు నుంచి పదో తరగతి విద్యార్థినులు 480, ఇంటర్మీడియట్ చదువుతున్న వారు 320, మొత్తం 800 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులు 160 మందే ఉండాల్సి ఉండగా, జిల్లాలోని నెక్కొండ మహాత్మా జ్యోతిబాపూలే కళాశాల నిర్వహణకు అవసరమైన వసతులు లేకపోవటం వల్ల అక్కడి నుంచి 160 మందిని ఇక్కడకు తీసుకొచ్చారు.
ఈ గురుకులంలోని పాఠశాల విద్యార్థినులు తరగతి గదుల్లో నేలపై కూర్చోవాల్సి వస్తున్నది. పాఠశాల విద్యార్థినులకు చెందిన డ్యుయల్ డెస్క్‌లను నెక్కొండ నుంచి వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థినులకు సమకూర్చటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. మూడు తరగతుల విద్యార్థినులు నేలపై కూర్చొని చదువు సాగిస్తున్నారు.
వరంగల్ జక్కలొద్ది వద్ద సొంత భవనంలో పనిచేస్తున్న ప్రభుత్వ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలకు రహదారి సమస్య ఉంది. వరంగల్‌ను ఆనుకుని ఉన్న జక్కలొద్ది గ్రామం వరకు బీటీ, సీసీ రోడ్డు ఉండగా, పాఠశాల వరకు కేవలం మట్టి రోడ్డు మాత్రమే ఉంది. వర్షం పడితే ఈ రహదారి పూర్తిగా బురదమయం అవుతోంది. దీంతో విద్యార్థులు, వారి పేరెంట్స్‌తో పాటు ఉపాధ్యాయులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత రోడ్డు నిర్మాణం కోసం ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలు ఆచరణలోకి రాలేదు. ఓ జనరేటర్ ఉన్నా రాత్రి వేళ కొన్ని సందర్భాల్లో కరెంటు కొరత ఏర్పడుతోంది. టీచర్ల కోసం నిర్మించిన క్వార్టర్లను అంతగా ఉపయోగించకపోవడంతో వాటి ముందు పచ్చగడ్డి పెరిగింది.
హనుమకొండ జిల్లాలో గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మురికి కూపాలుగా మారాయి. వాటిలో విద్యార్థులు పలు రకాల సమస్యలతో సహవాసం చేస్తున్నారు. చాలా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించడం లేదు. గత ప్రభుత్వం గురుకులాలు, ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లకు సన్నబియ్యంతోపాటు బలవర్ధకమైన పౌష్టికాహారం సరఫరా చేసింది. ప్రతి రోజూ కోడి గుడ్లు, వారంలో రెండు రోజులు చికెన్, చేపలు భోజనం పెట్టేవారు.
ప్రస్తుతం వారంలో రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు పెడుతున్నట్లు సమాచారం. కొన్ని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో దొడ్డు బియ్యం అన్నం, కుళ్లిపోయిన కూరగాయలు, ఉల్లిగడ్డలు, నీళ్ల చారుతో భోజనం పెడుతున్నట్లు కొందరు విద్యార్థులు తెలిపారు. అంతేకాక కిటికీలకు, రూమ్‌లకు మెష్(దోమ తెరలు)లు ఏర్పాటు చేయకపోవడం, ఫ్యాన్లు సరిగ్గా తిరగకపోవడంతో దోమలు, ఈగలతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. బాలసముద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉన్న కొన్ని గదులనే అన్నింటికీ వాడుతున్నారు. విద్యాబోధన చేయడంతోపాటు విద్యార్థులు ఆ గదుల్లోనే పడుకుంటున్నారు.
విద్యార్థులు కూర్చునేందుకు కుర్చీలు, పడుకొనేందుకు గార్మెంట్స్ లేక నేలపైనే కూర్చోబెట్టి క్లాస్‌లు చెప్పడం, రాత్రివేళ్లల్లో అదే నేలపైనే పడుకోబెట్టడడంతో విద్యార్థులు భయాందోళనకు గురువుతున్నారు. కెపాసిటీకి మించి విద్యార్థులు చేరుతుండడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని పలువురు వార్డెన్లు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి బియ్యం, పప్పులు సరఫరా చేస్తున్నప్పటికీ కోడిగుడ్లు, పాలు, కూరగాయల లాంటి ప్రొవిజన్స్‌కు గత ఫిబ్రవరి నెల నుంచి బిల్లులు రావడం లేదని, అప్పులు తెచ్చి సొంతగా కొనుగోలు చేస్తున్నట్లు వార్డెన్లు చెబుతున్నారు.
ములుగు జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్‌పై పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాములు, తేళ్లు లాంటి విషపూరిత పురుగుల కాటుకు విద్యార్థులు గురవుతున్నారు. దీంతో పాటు దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో రాత్రివేళ సరిగా నిద్రపోవడం లేదు.
ములుగు మండలం మల్లంపల్లిలోని అద్దె భవనంలో కొనసాగుతున్న ఏటూరునాగారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 450 మంది విద్యార్థులు ఉంటుండగా, గదుల్లో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. తరగతి గదుల్లో డ్యూయల్ డెస్క్‌లు లేక ఐదు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కింద కూర్చొనే విద్యనభ్యసిస్తున్నారు. బెడ్లు లేక చాపల పైనే నిద్రిస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా డ్యుయల్ డెస్కులు, బెడ్స్ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. ఇదిలా ఉండగా జాకారం సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో సైతం పరిశుభ్రత లోపించింది. పిచ్చిమొక్కల నడుమే మరుగుదొడ్లు ఉన్నాయి.
డోర్నకల్ : హాస్టల్ లో దోమల బెడద ఎక్కువగా ఉంది. రాత్రి సమయంలో విపరీ తంగా కుడు తున్నా యి. వీటి నివార ణకు వెంటనే చర్యలు చేప ట్టాలి. అలాగే కోతు లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలి. విద్యార్థులకు వడ్డించే అటుకులు మంచిగా లేవు.
– ఎడ్ల రేవతి, 9వ తరగతి విద్యార్థిని, కేజీబీవీ రాజుతండా, డోర్నకల్
మహబూబాబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో వసతులు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ పట్టణం గుమ్మడూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను శనివారం ‘నమస్తే తెలంగాణ’ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇందులో ఐదు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ విద్యార్థులు చదువుతున్నారు. దంతాలపల్లిలో అద్దె భవనం దొరకకపోవడంతో అక్కడి విద్యార్థులను కూడా ఇక్కడికే తీసుకొచ్చారు. మొత్తం 613 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
తరగతి గదులు సరిపడా ఉన్నప్పటికీ టాయిలెట్స్ కేవలం 22 మాత్రమే ఉండడంతో ఉదయం లేవగానే క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. బాత్రూంలు కూడా తక్కువగానే ఉన్నాయి. భోజనశాల సైతం చిన్నగా ఉండడంతో మూడు షిఫ్టుల్లో భోజనాలు చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ దేవులపల్లి రాజేశ్‌ను వివరణ కోరగా తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, సమస్యలను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లి పరిషరించేలా చూస్తానన్నారు.
వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం సమస్యలకు నెలవుగా మారింది. పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన నిర్వహణ లేక వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. ఫలితంగా విద్యార్థినులు నల్లా నీళ్లు తాగాల్సి వస్తోంది. కులుషిత నీటి వల్ల విద్యార్థులు పలుమార్లు జ్వరాల బారిన పడుతున్నారు. అలాగే మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా అపరిశుభ్రంగానే ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తోంది. అలాగే శుచి, రుచికరమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు.
ప్రస్తుతం ఇల్లంద కేజీబీవీలో 170మంది పాఠశాలలో, 94 మంది ఇంటర్ విద్యనభ్యసిస్తున్నారు. అంతేగాక వర్షాలు కురిస్తే పాఠశాల మైదానమంతా చిత్తడిగా మారుతున్నది. ఇటీవల వరుసగా కురిసిన వానలకు పాఠశాల ఆవరణలోకి నీరు చేరి బురదమయమై విద్యార్థులు బయటకు వచ్చే వీలు లేకుండా ఉంది. అయితే కేవలం మొరం పోయించి చదును కూడా చేయించే మమ అనిపించేశారు. ఇటీవల కలెక్టర్ సత్యశారద కూడా పాఠశాలను సందర్శించి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఎలాంటి ఫలితం లేదు.
పాఠశాలలోని మినరల్ వాటర్‌ప్లాంట్‌కు మరమ్మతు విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. అలాగే మిగిలిన సమస్యలను కూడా వివరించాం. త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. చదువులు, ఆటల్లో బాలికలు బాగా రాణిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విద్యార్థినులకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నాం.
జనగామ జిల్లాలోని పలు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయి. కొన్ని గురుకులాల్లో తరగతి గదుల పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. బెంచీలు లేక విద్యార్థులు నేలపైనే కూర్చొని పాఠాలు వింటున్నారు. డార్మెట్రీలో బెడ్స్ కూడా లేక నేలపైనే పడుకోవాల్సి వస్తోంది. బాత్రూంలు, మరుగుదొడ్లకు నీరు సరఫరా అయ్యే కుళాయిలు విరిగిపోయాయి. మరికొన్ని గురుకులాల్లో మరుగుదొడ్లకు తలుపులు లేవు. విద్యార్థులు ఆరుబయట మల విసర్జన కోసం వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
సరిపడా తరగతి గదులు, డార్మెట్రీలు లేక సమీపంలోని మరో గురుకులానికి విద్యార్థులను బదలాయిస్తున్నారు. కొన్ని గురుకులాల్లోని తరగతి గదుల్లో పాఠాలు బోధించేందుకు అవసరమైన నల్లబల్లలు కూడా సరిగా లేవు. జిల్లాకేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తరగతి గదుల పైకప్పు పెచ్చులూడుతున్నాయి. ఇది ఈ నెల 5న రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలగు వర్షిణి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కలిసి పాఠశాలను సందర్శించిన సమయంలో బయట పడగా వారు అక్కడి పరిస్థితి చూసి విస్మయం చెందారు. అలాగే బాత్రుం, మరుగుదొడ్ల దుస్థితిని చూసి అధికారులు సైతం నివ్వెరపోయారు.