రాష్ట్ర ప్రభుత్వం వ్యాధుల నివారణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికా రులు జిల్లాలో ఫైలేరియా(బోదకాలు) నిర్మూలన కోసం పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. వ్యాధిని గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. ఇందుకోసం 169 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఫిక్స్డ్ ఏరియాల్లో రాత్రి వేళ రక్త నమూనాలు సేకరించారు. బాధితులను గుర్తించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల్లోనూ సర్వే చేపట్టి బ్లడ్ శాంపిల్స్ సేకరించి, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే మందులు అందజేస్తున్నారు. బాధితులకు కిట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది.
వరంగల్, నవంబర్ 9(నమస్తేతెలంగాణ): బోద కాల వ్యాధిని గుర్తించేందుకు జ్వర సర్వే తరహాలో ఫైలే రియా సర్వే నిర్వహిస్తున్నారు. ఫిక్స్డ్ ఏరియాల్లో రాత్రివేళ రక్త నమూనాలు సేకరిస్తున్నారు. మైక్రో ఫైలేరి యా క్రిమి ఉన్నట్లు గుర్తించిన వారికి మందులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఫైలేరియా వ్యాధి బారిన పడిన బాధితులకు కిట్లను అందజేస్తున్నారు. జిల్లాలో సంగెం మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఖిలా వరంగల్ మండలంలోని బొల్లికుంట, గాడిపల్లి, తిమ్మా పూర్, మామునూరు వైద్య, ఆరోగ్యశాఖ సబ్ సెంటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికే ఫైలేరియా వ్యాధి ఫిక్స్డ్ ఏరియాలుగా గుర్తించింది. ఈ క్రమంలో ఏటా ఒకసారి ఈ గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది రాత్రివేళ అనుమా నితుల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. రాత్రి వేళ మైక్రో ఫైలేరియా క్రిమి బాధితుల రక్తనాళాల్లో ఉంటుందని రాత్రి 10 నుంచి 2 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పరీక్షల ద్వారా మైక్రో ఫైలేరియా ఉందా? లేదా? అనేది గుర్తిస్తున్నారు. ఇందులో భా గంగా ఇటీవల ఈ ఫిక్స్డ్ ఏరియాల్లోని గ్రామాల్లో రాత్రి వేళ రక్త నమూనాలు సేకరించి మైక్రో ఫైలేరియా క్రిమి ఉన్న వారిని పరీక్షల ద్వారా గుర్తించా రు. ముందు జాగ్రత్త చర్యగా ఈ గ్రామాల్లో ఫైలేరియా వ్యాధి నిర్మూలన కోసం సుమారు 67 వేల మందికి ఉచిత మందుల పంపిణీ చేపట్టారు. ఇందుకోసం 169 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కోసం పన్నెండు మందిని సూపర్వైజర్లను నియమించారు. ప్రతి బృందంలో ఇద్దరు ఆశ వర్కర్లు లేదా అంగన్వా డీ కార్యకర్తలు ఉన్నారు. గత అక్టోబర్ 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఈ గ్రామాల్లో ఫైలేరియా వ్యాధి నిర్మూలన కార్యక్రమం ద్వారా మందులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి డీఈసీ, అల్బెండజోన్ మందులను అందజేశారు. రెండేళ్లకు పైబడిన వయసు గల వారు ఈ మందులను ఒకసారి వాడితే ఈ వ్యాధి సోకదని అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలకు చెప్పారు. బోదకాలు వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలను కూడా వివరించారు. ఊరూరా ఈ మందుల పంపిణీ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతుంది.
ఇతర ప్రాంతాల్లో సర్వే
ఫిక్స్డ్ ఏరియాల్లో రాత్రివేళ రక్త నమూనాలు సేక రించి మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఇతర ప్రాంతాల్లో ఫైలేరియా సర్వే చేపట్టారు. ఇంటింటా జ్వర సర్వే మాదిరిగా కొద్దిరోజుల నుంచి ఫైలేరియా సర్వే నిర్వహిస్తున్నారు. నెక్కొండ, దుగ్గొండి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో రాత్రివేళ రక్త నమూ నాలు కూడా సేకరించారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి ఫైలేరియా నిర్మూలనకు వెంటనే మందులను అందజేస్తున్నారు. సర్వే ద్వారా వ్యాధిని గుర్తించి ని ర్మూలన కోసం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. బాధితులకు కిట్లను కూడా అందజేస్తున్నారు. ఈ కిట్‌లో బకెట్, మగ్గు, టవల్, యాంటీ సెఫ్టిక్ లోషన్, క్రీమ్‌ను ప్రభుత్వం అంద జేస్తుంది. వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా అధికారి వెంకట రమణ, ప్రోగ్రాం ఆఫీసరు చల్లా మధుసూదన్ ఫైలేరి యా వ్యాధి సర్వే, రక్త నమూనాల సేకరణ, మందుల పంపిణీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
1,233 మంది బాధితులు
– చల్లా మధుసూదన్, వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి
జిల్లాలో ఫైలేరియా వ్యాధి నిర్మూలన కార్య క్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నాం. ఫీవర్ సర్వేలాగే జరుగుతోంది. మెడికల్ ఆఫీసర్లు, సి బ్బంది పాల్గొంటున్నారు. మందుల పంపిణీ కా ర్యక్రమం కూడా కొనసాగుతుంది. ఫైలేరియా వ్యాధి బాధితులు జిల్లాలో 1,233 మంది ఉన్నా రు. వీరిలో 460 మంది ఆసరా పథకం పింఛన్ కోసం దరఖాస్తులను అందజేశారు. సుమారు 260 మందికి పింఛన్ కూడా మంజూరైంది. త్వరలో మరికొందరికి అందనుంది. 408 మందికి కిట్లను అందజేశాం. ఇతరులకూ కిట్లను పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది.