గోవిందరావుపేట, జూలై31: మూడు వాగులు దాటి..7 కి.మీ నడిచి గొత్తికోయగూడెం గ్రామస్తులకు వైద్య సేవలందించారు. పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష, సబ్ యూనిట్ ఆఫీసర్ భూపాల్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ జంపయ్య, ఆశ వర్కర్ సమత బుధవారం చల్వాయి గ్రామపంచాయతీ పరిధిలోని కన్నాయిగుంపు గొత్తికోయగూడేన్ని సందర్శించారు.
ఉదయం 8.30కు వెళ్లిన వైద్య సిబ్బంది రెండు గంటల పాటు ప్రయాణం చేశారు. వలుపల వాగు, జారుడు బండ వాగు, వట్టి వాగులను దాటుకుంటూ రాను పోను 14 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. 15 కుటుంబాలను పరీక్షించి, అనారోగ్యంగా ఉన్న 25 మందికి వైద్యం చేసి మందులను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ డీఎంహెచ్‌వో అప్పయ్య, పీహెచ్సీ వైద్యాధికారి చంద్రకాంత్ ఆదేశాల మేరకు గూడెంను సందర్శించామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు దోమల నివారణకు దోమ తెరలను వాడాలని గొత్తికోయలకు సూచించినట్లు తెలిపారు.