Harish Rao : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డివి మతిలేని మాటలు అంటూ ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇవాళ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన హరీశ్ రావు.. బీఆర్ఎస్ చేపట్టబోయే పాదయాత్ర భయంతో సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర కరువైందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తమను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు చేసిందేమీ లేదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ 75 శాతం కృష్ణా నీటిని వాడుకుంటే, తెలంగాణ కేవలం 25 శాతానికే పరిమితమైందని విమర్శించారు. ఈ వైఫల్యానికిగానూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. పాలమూరు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందన్నారు.
రాబోయే రోజుల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని మళ్లీ ఓడించి, పాలమూరు గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని హరీశ్ రావు ధీమా వ్యక్తంచేశారు. ఆంధ్రా పాలకులకు తొత్తులా మారిన రేవంత్‌రెడ్డికి పాలమూరు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని అన్నారు.