మహబూబాబాద్ జూన్ 8 (నమస్తే తెలంగాణ) : పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో అక్రమాలు ఒకొకటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో అధికారితోపాటు ముగ్గురు సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తొర్రూరు మండలంలో పెద్ద ఎత్తున పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో డీలర్లు, అధికారులు కుమ్మక్కై వాటిని నల్లగొండ జిల్లాకు పంపించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. నేరుగా డీలర్లకు పాస్వర్డ్, యూజర్ ఐడీ ఇచ్చి ఇష్టానుసారంగా లెకలు తారుమారు చేశారు. సుమారుగా 3 బస్తాల విత్తనాలను ఇతర జిల్లాలకు బ్లాక్ మారెట్‌కు తరలించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఇదే తరహాలో మరిపెడ మండలంలో కూడా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో విచారణ చేయించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడినా, పంట విత్తనాలను బ్లాక్ మారెటింగ్ చేసినా, కల్తీ విత్తనాలు అమ్మినా.. ఎంతటి వారినైనా వదలొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో తొర్రూరు మండలంలో పచ్చిరొట్ట విత్తనాలను బ్లాక్ మారెట్ ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కారణమైన తొర్రూరు మండల వ్యవసాయాధికారి కే సోమకుమార్ యాద వ్, తొర్రూరు క్లస్టర్ గ్రేడ్-2 ఏఈవో ఎం జమున, అమ్మాపురం క్లస్టర్ ఏఈవో అజ్మీరా దీపిక, హరిపిరాల ఏఈవో సీహెచ్ అరవింద్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ గోపి ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేశారు.
మరిపెడ మండలం అసిస్టెంట్ డైరెక్టర్‌ను విచారణాధికారిగా నియమించారు. దీంతో, విచారణ చేపట్టిన మరిపెడ ఏఈ తొర్రూరు మండలంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలున్నాయని నివేదిక సమర్పించారు. ప్రధానంగా తొర్రూరు మండల వ్యవసాయాధికారి సోమకుమార్ యాదవ్‌కు చెందిన పోర్టల్ లాగిన్‌ను నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ఏఈవోలకు ఇవ్వడంతో దీనిని దుర్వినియోగం చేసిన ఆ ముగ్గురు ఏఈవోలు విత్తనాలను బ్లాక్ మారెట్‌కు తరలించారని తన నివేదికలో ఏడీ పేర్కొన్నారు. దీంతో నలుగురు అధికారులను వ్యవసాయశాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా మరిన్ని మండలాల్లో తనిఖీలు చేస్తే ఇంకా అక్రమాలు బయటకు వచ్చే అవకాశముంది.