వరంగల్ చౌరస్తా: కాకతీయవిశ్వవిద్యాలయ క్యాంపస్ ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించిన 23వ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. సోమవారం యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన బి. ఏ (ఎల్) విభాగ విద్యార్థులు బండారి రమణి, దరావత్ వెంకన్న, రాజబోయిన యాదలక్ష్మి విశేష ప్రతిభ కనబరచి బంగారు పతకాలను పొందడం గర్వంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ సానబోయిన సతీష్ తెలిపారు.
విద్యార్థులు తమ కోర్సుల్లో విశ్వవిద్యాలయ స్థాయిలో అగ్రస్థానాలు సాధించి గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. ఈ ఘనత విద్యార్థుల కృషికి, అధ్యాపకుల మార్గదర్శనానికి, కళాశాల శిక్షణ ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కళాశాల అధ్యక్షులు ఆకారపు హరీష్ కుమార్, కార్యదర్శి ఆచార్య చిలకమారి సంజీవ , కోశాధికారి చకిలం ఉపేందర్, అధ్యాపకులు విజేతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచడమే కాక, భవిష్యత్ విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని కళాశాల యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసిందని ఆయన అన్నారు.