హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 22 : జీవో 29ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని అంబేదర్ విగ్రహం వద్ద బీసీ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ పొలిటికల్ జాక్ చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ లక్ష్మీప్రసాద్, ఫూలే యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్, ఆలిండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, బీసీ నాయకులు పులి రజనీకాంత్ పాల్గొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ జీవో 29ను ప్రభుత్వం దురద్దేశపూర్వకంగా తీసుకువచ్చిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ ఎలా కేంద్రమైందో అదే తరహాలో ఇక్కడి నుంచి మరో బీసీ ఉద్యమం ఉద్భవిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటే వేలాదిమంది బీసీలు ప్రభుత్వంపై దండెత్తాల్సిన అవసరం వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌తో సహా ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ప్రభుత్వం సింహభాగం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫూలే యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ కేవలం అగ్రవర్ణాలకు లాభం చేకూర్చే విధంగా జీవో 29 ఉందన్నారు. దీని ద్వారా 560 పోస్టులకు 210 కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే కేటాయించేలా ఉందని, వెంటనే జీవో 29 రద్దుచేసి జీవో 55ని అమలు చేయాలన్నారు. నిరసన సందర్భంగా లాఠీ దెబ్బలు తిన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు, విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేకపోయారని, మానవతా కోణంలో ఆలోచించి సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.