వరంగల్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక వరంగల్ నగరం ఐటీ పరిశ్రమకు కేంద్రంగా మారుతోంది. దిగ్గజ కంపెనీలు వరుసగా వరంగల్ నగరానికి వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా మరో పెద్ద కంపెనీ జెన్ ప్యాక్ట్ వస్తోంది. ఈ మేరకు జెన్‌ప్యాక్ట్ సంస్థ ప్రకటించింది. జెన్ ప్యాక్ట్ సీఈవో టైగర్ త్యాగరాజన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విద్యా శ్రీనివాసన్, ఇండియా ఆపరేషన్స్ లీడర్ సతీశ్ వడ్లమాని తదితరుల బృందం ఐటీ మంత్రి కే తారకరామారావుతో గురువారం హైదరాబాద్‌లో కలిసింది. అనంతరం జెన్‌ప్యాక్ట్ సీఈవో త్యాగరాజన్ వరంగల్ కేంద్రంగా తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుందని ప్రకటించారు. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరుగాలని, అందుకు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికకు అనుగుణంగా ఐటీ మంత్రి కేటీఆర్ ఆచరణతో పెద్ద ఐటీ కంపెనీలు వరంగల్ నగరానికి వస్తున్నాయి. మడికొండలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఇప్పటికే ఐటీ పరిశ్రమల విస్తరణ జరుగుతోంది. టెక్ మహీంద్రా, సైయంట్, మైండ్ ట్రీ, క్వాడ్రెంట్ రిసోర్సెస్ వంటి కంపెనీలు వరంగల్ నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో పెద్ద కంపెనీ జెన్ ప్యాక్ట్ రాకతో వరంగల్ నగరంలో ఐటీ విస్తరణ మరింత వేగవంతం కానుంది.
ప్రపంచంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్‌కు అనుబంధంగా వరంగల్ మహానగరంలో ఐటీ రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఐటీకి దేశంలో ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా ఉన్న బెంగళూరుకు తోడుగా మైసూరు అభివృద్ధి చెందింది. ఆ తరహాలోనే హైదరాబాద్‌కు వరంగల్‌ను ఐటీ పరంగా అభివృద్ధి చేయాలని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ఉన్నారు. హైదరాబాద్‌కు దగ్గరలో ఉండడం వంటి అనుకూలతలు వరంగల్‌లో ఐటీ విస్తరణకు బాగా ఉపయోగపడే అంశంగా ఉంది. కాజీపేట రైల్వే జంక్షన్, జాతీయ రహదారులతో వరంగల్ నగరంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ ఉంది. ఈ అంశాలు అనుకూలంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలో ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రత్యేకంగా ఐటీ హబ్‌ను నిర్మించింది. సైయంట్, టెక్ మహీంద్రా మొదట ఈ హబ్‌లోనే కార్యకలాపాలు నిర్వహించాయి. వరంగల్ నగరంలో ఐటీ విస్తరణలో భాగంగా 2020 ఫిబ్రవరి 6న మంత్రి కేటీఆర్ వరంగల్‌లో సైయంట్ కంపెనీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను, టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. సైయంట్ సొంత భవానాల్లోకి మారడంతో ప్రభుత్వ ఇంక్యుబేషన్ సెంటర్లో టెక్ మహీంద్రా తమ కార్యకలాపాలను మొదలుపెట్టింది. టెక్ మహీంద్రా సొంతంగా భవనాలను సమకూర్చునే ప్రక్రియలో ఉంది. తాజాగా జెన్ ప్యాక్ట్ విస్తరణలో భాగంగా వరంగల్‌కు వస్తోంది. ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు వరుసగా వస్తుండడంతో వరంగల్‌లో ఐటీ విస్తరణ వేగవంతమవుతోంది. సైయంట్ కంపెనీ 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన క్యాంపస్‌లో రెండు వేల మంది పని చేసే అవకాశం ఉంది. టెక్ మహీంద్రా సైతం కొత్త భవనాన్ని పూర్తి చేస్తే ఇదే స్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. మైండ్ ట్రీ, క్వాడ్రెంట్ రిసోర్సెస్ కంపెనీలు వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టాయి.
వరంగల్‌లో ఐటీ రంగం విస్తరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతోపాటు సబ్సిడీలను ఇస్తోంది. వరంగల్ మహానగరానికి మొదట వచ్చే ఐటీ కంపెనీలకు మూడేండ్లపాటు మున్సిపల్ పన్నుల నుంచి మినహాయింపు ఉంటోంది. ఐటీ ఈవెంట్ల నిర్వహణ ఖర్చుల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి యూనిట్‌కు రూపాయి చొప్పున కరంట్ బిల్లులను తిరిగి ఇస్తోంది. ఐటీ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని సమకూర్చే ప్రక్రియలో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో శిక్షణ ఇప్పిస్తోంది. క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తే టాస్క్ నుంచి ప్రతి విద్యార్థికి రూ.20 వేల వరకు సహకారం అందిస్తోంది. 250కిపైగా ఐటీ ఉద్యోగాలు, 500కు పైగా ఐటీ ఆధారిత ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తోంది. వరంగల్ మహానగరంలో వృత్తి విద్యా కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తుండడంతో వరంగల్‌లో ఐటీ రంగం విస్తరిస్తోంది. హైదరాబాద్‌తో పోలిస్తే వరంగల్ వంటి నగరాల్లో ఐటీ కంపెనీల నిర్వహణ ఖర్చు 25 శాతం వరకు తగ్గుతుంది. ఇవన్నీ వరంగల్ నగరంలో ఐటీ విస్తరణకు అనుకూల అంశాలుగా ఉన్నాయి.
మంత్రి ఎర్రబెల్లి హర్షం…
ఐటీ దిగ్గజ కంపెనీ జెన్ ప్యాక్ట్ వరంగల్ నగరం లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించడం పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణం గా, ఐటీ మంత్రి కేటీఆర్ ఆచరణ మేరకు నగరానికి పెద్ద కంపెనీలు వస్తున్నాయి. జెన్ ప్యాక్ట్ వరంగల్‌కు రావడం శుభవార్త. ఐటీ రంగం వరంగల్‌లో విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు, ఐటీ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.