నల్లబెల్లి, జూలై 07: ఈనెల 9న జరుగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా కోశాధికారి గొర్రె ప్రదీప్ పిలుపునిచ్చారు. నల్లబెల్లి మండలం నారక్కపేటలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని బీజేపీ-ఆర్ఎస్ఎస్ మనువాద ప్రభుత్వం హరిస్తున్నదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడులుగా మారుస్తున్నారని చెప్పారు. దీంతో సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రోజుకు ఎనిమిది గంటలపాటు చేస్తున్న పని గంటలు 12 గంటలకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కార్మికులు 12 గంటలపాటు పని చేస్తున్నారని వెల్లడించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ప్రభుత్వం పని గంటలను 10 కి పెంచిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలను తగ్గించే విధంగా చర్యలు తీసుకొని కార్మిక వర్గ హక్కులని కాపాడాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు చెన్నమల మొగిలి, పెసర కుమారస్వామి, కావటి శ్రీనివాస్, కృష్ణంరాజు, కందకట్ల మురళి, దండం రాజేష్, కుసుమ రాజేందర్, కోడూరి రాజు తదితరులు పాల్గొన్నారు.