మరిపెడ, జూలై 9 : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల సరఫరాపై ఆరా తీశారు. వివరాలిలా ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో భద్రాచలం సమీపంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం భూక్యా తండాలో స్థానిక పోలీసులతో కలిసి ఐదుగురు ఎన్ఐఏ అధికారులు ఓ వ్యక్తి ఇంట్లో ఉదయం 5 నుంచి 9 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు.
అనంతరం అనుమానితుడిని మరిపెడ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ కొనసాగిస్తున్నారు. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం తోటల్లో మిర్చి ఏరేందుకు, పొలాల్లో పనిచేసేందుకు అక్కడి నుంచి కూలీలను తీసుకొచ్చాడు. ఈ క్రమంలో భూక్యా తండాకు చెందిన ఓ వ్యక్తితో స్నేహం ఏర్పడడంతో ఇద్దరు కలిసి సమీపంలో ఉన్న ఆకేరు వాగులో చేపలు పట్టేందుకు పేలుడు పదార్థాలు ఉపయోగించేవారు. ఒడిశా వాసి సొంతంగా చేపలు పట్టేందుకు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి వాటిని సంఘ విద్రోహ శక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఎన్ఐఏ సోదాలతో భూక్యా తండా వాసులు ఉలిక్కిపడ్డారు. తొలుత పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు భావించిన తండావాసులు, అసలు విషయం తెలియడంతో ఖంగుతిన్నారు.