ఖిలావరంగల్, ఏప్రిల్ 30: వరంగల్ జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా అధికార ప్రతినిధి ఆడేపు వెంకటేష్ అధ్యక్షతన ఏకశిలా పార్క్ వద్ద వరంగల్ జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని కోరుతూ ధర్నా అనంతరం వరంగల్ కలెక్టరేట్లో డిఆర్ఓ విజయలక్ష్మి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండి పోరాడిన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కోరుతూ దేశాయిపేట ఇండ్ల ముందు నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్‌కు బీజేపీ మద్దతు ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు కావస్తున్నా జర్నలిస్టులకు నీడ లేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న లబ్ధి దారులకు ఇండ్లు ఇయ్యక పొవడం వలన శిథిలావస్థకు చేరుతుతున్నాయని తెలిపారు. సమస్య శాంతియుతంగా పరిష్కారం కాకపోతే నగర నడిబొడ్డున తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులతోపాటు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు మార్తీనేని ధర్మారావు, మాజీ పార్లమెంట్ సభ్యుడు అజ్మీర సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, ఆరూరి రమేష్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు చాడ శ్రీనివాసరెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ , గురుమూర్తి శివకుమార్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.