కాజీపేట, జూలై 1: హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ ప్రాంగణంలో మంగళవారం గంజాయి మత్తులో యువత హల్చల్ చేసింది. రైళ్ల్లు, స్టేషన్లలో భిక్షాటన చేసే కొందరు అనాథ యువతీయువకులు మత్తులో రాళ్లు, కట్టెలతో కొట్టుకుంటుండగా ప్రయాణికులు పరుగులు తీశారు. వివరాలిలా ఉన్నాయి.. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతీయువకులు, అనాథలు, వృద్ధులు ప్రతి రోజూ రైళ్లల్లో, రైల్వేస్టేషన్ల్లో భిక్షాటన చేస్తూ కాజీపేట రైల్వే స్టేషన్ అడ్డాగా నివసిస్తుంటారు.
రైల్వే జంక్షన్ ముందు ప్రాంగణంలో మంగళవారం గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు వేర్వేరుగా రెండు గ్రూపులుగా ఏర్పడి గొడవకు దిగారు. ఓ యువకుడు మహిళను కట్టెతో వెనుక నుంచి తలపై బలంగా కొట్టడంతో అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెకు సంబంధించిన వ్యక్తి వచ్చి యువకుడితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత మహిళను కొట్టిన యువకుడే ఆ వ్యక్తిని తలపై చాలా సార్లు బలంగా కొట్టడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు.
ఆ యువకుడే కట్టె పట్టుకుని రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఇష్టారాజ్యంగా తూలుతూ తిరుగుతుండడంతో భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. రైల్వే పోలీసులు మాత్రం ఎవ్వరికి పట్టనట్లు ప్రేక్షక పాత్ర వహించారు. రైల్వే స్టేషన్ మేనేజర్ ఆదేశాలతో ఆర్టీఎఫ్ పోలీసులు గంజాయి మత్తులో ఉన్న యువతీయువకులను చెదరగొట్టారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేస్తుంటే రైల్వే అధికారులు, పోలీసులు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని ప్రయాణికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రైల్వే స్టేషన్లలో గంజాయి మత్తులో ఉన్న వారితో భద్రత లేకుండా పోతున్నదని వారు చెబుతున్నారు.