సుబేదారి, నవంబర్ 25 : మెటల్ డికెక్టర్ సహాయంతో పలు చోట్ల గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ఎనిమిది మంది సభ్యుల ముఠాను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. హనుమకొండ న్యూశాయంపేట హనుమాన్‌గుడిలో పూజారిగా పనిచేస్తున్న కట్రోజు అరవింద్ మహాకాళి అలియాస్ అఘోరస్వామి, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన ముప్పారపు రవి,
నర్సంపేట సంజీవనగర్‌కు చెందిన వేముల శ్రీనివాస్, దాసరిపల్లికి చెందిన గొల్లెన సురేశ్, మహబూబాబాద్ చేపల మార్కెట్‌కు చెందిన బయ్య శివరాజ్, కాజీపేట ఫాతిమానగర్‌కు చెందిన హనుమకొండ ప్రభాకర్, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగుట్టకు చెందిన ముక్క భాస్కర్, హైదరాబాద్ బోడుప్పల్‌లోని రాజుపేటకు చెందిన బస్వరాజు రమేశ్ ముఠాగా ఏర్పడి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు కట్రోజు అరవింద్‌కు గంగదేవిపల్లికి చెందిన 99 టీవీ మాజీ జర్నలిస్టు ముప్పారపు రవి గుప్తనిధులను గుర్తించడానికి మెటల్ డిటెక్టర్ అందజేశారు.
దీని సహాయంతో భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో గుప్తనిధుల తవ్వకానికి ముఠా వెళ్తుండగా పక్కా సమాచారంతో హనుమకొండలోని పద్మాక్షి కాలనీలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వీరు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట, ధర్మసాగర్ మండలం దేవునూరు, నగరంలోని పద్మాక్షి కాలనీ, న్యూశాయంపేట డబుల్బెడ్రూం ఇండ్ల ప్రాంతాల్లో తవ్వకాలు జరుపగా ఎలాంటి గుప్తనిధులు లభించలేదని తేలింది. ఈ ముఠా నుంచి రెండు కార్లు, స్కూటీ, మెటల్ డిటెక్టర్, లొకేటర్, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు.