జయశంకర్ భూపాలపల్లి, జూన్ 19 (నమస్తేతెలంగాణ)/టేకుమట్ల : విప్లవోద్యమంలో నేలరాలిన వెలిశాల వేగుచుక్క మృతదేహం నేడు స్వగ్రామంకు చేరుకోనున్నది. గణేశ్ మృతదేహం ఎప్పుడొస్తుందా.. అని కడసారి చూపుకోసం అభిమానులు, మిత్రులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మిత్రు లు, అభిమానులు వెలిశాల పరిసర గ్రామాలకు చేరుకున్నారు. గ్రామంలో ‘జోహార్ కామ్రేడ్స్’ అంటూ ఎర్ర బ్యానర్లు వెలుస్తున్నాయి. గణేశ్ అంత్యక్రియలకు బంధుమిత్రులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా, పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గణేశ్ మృతదేహం కోసం ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు గురువారం మధ్యాహ్నం వరకు మృతదేహాన్ని చూపించలేదు. కనీసం ఎక్కడున్నదనే విషయం కూడా గోప్యంగా ఉంచారు.
ఎన్కౌంటర్ జరిగిన రోజే గణేశ్ మృతి చెందినట్లు ప్రకటించిన పోలీసులు సుమారు 36 గంటలు దాటినా మృతుల ఫొటోలు విడుదల చేయలేదు. మృతులను చూపించకపోవడంతో అసలేం జరుగుతున్నదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఈ విషయమై రంపచోడవరంలో గణేశ్ సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు విలేకరులతో మాట్లాడారు. గణేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు గురువారం మధ్యాహ్నం ఒక్కొక్కరిని మృతదేహాలను చూసేందుకు అనుమతించారు. ఫొటోలు మాత్రం తీయనివ్వలేదని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, గురువారం మధ్యాహ్నం గణేశ్ మృతదేహాన్ని చూసేందుకు అనుమతిచ్చారని, మృతి చెందింది గణేశ్ అని నిర్ధారించుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా వెలిశాలకు తెలిసింది.
గురువారం అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉండగా, మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున వెలిశాలకు చేరనున్నది. దీంతో వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ‘వెలిశాల’ పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా గణేశ్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన సమాచారాన్ని గ్రామస్తులు తెలుసుకుంటూ, అందులో పోస్టులు పెడుతున్నారు. విప్లవోద్యమానికి వెలిశాల అందించిన బిడ్డలను ఉద్దేశించి కవి మిట్టపల్లి సురేందర్ రాసిన ‘తల్లీ నా వెలిశాల’ అనే పాట, ఈ పాట రాసి 20 ఏళ్లు అయిన సందర్భంగా జరిపిన సభ ఫొటోలు ఈ సందర్భంగా వైరల్‌గా మారుతున్నాయి.
పోలీసులు మా అన్న గాజర్ల అశోక్ అలియాస్ గణేశ్‌ను పట్టుకొని కొంతకాలం చిత్రహింసలకు గురిచేసి ప్రీ ప్లాన్డ్‌గానే మర్డర్ చేసినట్లు పోలీసుల తీరును బట్టి తెలుస్తున్నదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అన్నారు. గురువారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రంపచోడవరంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు తమ సోదరుడి పేరు ప్రకటించడంతో బుధవారం రాత్రి రంపచోడవరానికి చేరుకున్నామని, రాత్రి మృతదేహాన్ని చూపించడం వీలుకాదని, ఉదయమే చూపిస్తామని చెప్పారని అన్నారు.
ఎన్కౌంటర్ జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఫొటోలు కూడా విడుదల చేయలేదని, మృతదేహాలు ఎక్కడున్నాయో కూడా చెప్పడం లేదన్నారు. దీనిని బట్టి తమకు గంటగంటకూ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. మీడియాకు సైతం ఇప్పటి వరకు అనుమతివ్వకపోవడమేంటన్నారు. డెడ్‌బాడీలు చూస్తే విషయం బయటపడుతుందనే చూపించడం లేదా అని మండిపడ్డారు. దండకారణ్యంలో ఎన్కౌంటర్ జరిగినా మోదీ, అమిత్‌షా ట్విట్టర్ ద్వారా ఫొటోలు విడుదల చేశారు. ఇక్కడ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
ఈ నెల 18న ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని సీపీయూఎస్ఐ పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం అటవీప్రాంతంలో గాజర్ల రవి అలియాస్ గణేశ్, అరుణక్క, అంజి అనారోగ్యరీత్యా షెల్టర్ తీసుకుంటుండగా ఓ విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ముగ్గురిని ప్రాణాలతో పట్టుకొని హింసించి బూటకపు ఎన్కౌంటర్ చేశారన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, హైకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మారణహోమాన్ని ఆపాలని, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని మావోయిస్టు ఇచ్చిన బంద్ పిలుపునకు తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.