గణపురం, ఏప్రిల్24 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆహ్వానించి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని బస్వరాజుపల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి, కొండాపూర్, సీతారాంపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ సకాలంలో సభాస్థలికి చేరుకొని పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి అబద్ధాల కాంగ్రెస్ సరారుకు బుద్ధి చెప్పాలని, దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం నగరంపల్లి బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోషణ మహేశ్ బీఆర్ఎస్లో చేరగా ఆయనకు గండ్ర గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశాల్లో మండల పార్టీ అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి, భూపాలపల్లి మారెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలుసాని లక్ష్మీనరసింహారావు, గణపురం పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, మంద అశోక్‌రెడ్డి రామంచ భద్రయ్య, ఉడుత సాంబయ్యయాదవ్, పేరాల దేవేందర్‌రావు, మార్త సుధాకర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి, ఏప్రిల్ 24: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చేందుకు జనం సన్నద్ధమవుతున్నారు. వర్ధన్నపేట ఇన్చార్జి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపు మేరకు హసన్‌పర్తి మండలం దేవన్నపేట గ్రామ అధ్యక్షుడు సూధన్ 50 ఎడ్లబండ్లను సిద్ధం చేస్తున్నారు.
సూరం వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లకు గులాబీ రంగులు వేసి గులాబీ జెండాలతో ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గంలోనే దేవన్నపేట ఆదర్శంగా ఉండేందుకు 50 ఎడ్లబండ్లు, 500మందితో సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. వారి వెంట మాజీ సర్పంచ్ చుంచు రవి, పాక్స్ డైరెక్టర్ విజేందర్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.