కృష్ణకాలనీ, ఏప్రిల్ 12 : సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సహచర మంత్రులు మాట్లాడే భాషను వింటున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఛీ కొడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ-కారు రేసుపై మంత్రి సీతక్క చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేసిన సెల్ఫోన్లలో అవినీతి జరిగిందని ఆరోపణలొచ్చాయన్నారు.
దీనిపై వివరణ ఇవ్వాల్సింది పోయి చెప్పు తెగుద్ది.. చెప్పులతో కొడతామని బూతులు మాట్లాడటం ఏం సంప్రదాయమో సీతక్క ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఒకో సెల్‌ఫోన్‌కు రూ.2 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర ఉంటుంది. ప్రతిపక్షాలు అభియోగం చేసినప్పుడు పంపిణీ చేసిన సెల్ఫోన్లు ఏ మోడల్, ఏ కంపెనీ, ఒక్కోదానికి ధర ఎంతో వివరాలు చెప్పాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని కాంగ్రోసోళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ- కారు రేసు తీసుకొస్తే అందులో కూడా అవినీతి జరిగిందని, ఏ ఆధారాలతో కాంగ్రెసోళ్లు చార్జీషిట్ వేశారు..? విద్యుత్ కొనుగోలుపై అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో కమిషన్లు వేశారో ప్రజలకు తెలపాలని మంత్రి సీతక్కను ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి భూపాలపల్లికి వచ్చి తాను 1400 ఎకరాల భూమిని కబ్జా చేశానని తప్పుడు ఆరోపణలు చేసిండు.
మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లువుతున్నా ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పరువు నష్టం దావా, క్రిమినల్ ప్రొసీడింగ్స్, సివిల్ కేసులు కూడా వేశానన్నారు. మంత్రి సీతక వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ప్రతిపక్షాలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని గండ్ర డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ ముంజంపల్లి మురళీధర్, నాయకులు లచ్చన్న, బుర్ర రాజు, యుగేంద్రాచారి, మహేందర్, హరీశ్, బెజ్జల వంశీ, అంగోతు తిరుపతి, ఓనపాకల వంశీ, తదితరులు పాల్గొన్నారు