కృష్ణకాలనీ, ఏప్రిల్ 16 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోనూ గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బుధవారం ఆయన బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన జరిగిన 1, 2, 11, 12, 13, 14 వార్డుల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. కాసింపల్లిలోని పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి చల్లూరిపల్లి వరకు 200 బైక్‌లతో పార్టీ నాయకులు నిర్వహించిన భారీ బైక్‌ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కాసింపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, వ్యవసాయ భూములకు సైతం రోడ్లు వేయించానన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీకి ఒక రూపాయి తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. తాను రూ. రూ. 30 కోట్ల నిధులు తీసుకొచ్చి ఒకటే శిలాఫలకం వేస్తే.. అవే నిధులతో ప్రస్తుత ఎమ్మెల్యే శిలాఫలకాలు వేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పాలనలో దోని నిండింది లేదు, దొయ్య పారింది లేదన్నారు. బీఆర్ఎస్ అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిందని, ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి అనేక పథకాలు అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. ఎలతుర్తిలో నిర్వహించే రజతోత్సవ బహిరంగ సభకు శ్రేణులు హాజరవ్వడంతో పాటు ప్రతి వార్డు నుంచి 250 మందిని తరలించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం కాసింపల్లిలో అనారోగ్యాలతో బాధపడుతున్న పలు కుటుంబాలను పరామర్శించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్దు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేశ్, యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, మాజీ చైర్మన్ బండారి సంపూర్ణ రవి, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు, మాజీ కౌన్సిలర్లు మంగళపల్లి తిరుపతి, జకం రవికుమార్, దార పూలమ్మ, ఆకుదారి మమత, బానోత్ రజిత, నాయకులు బీబీ చారి, మేనం రాజేందర్, పోలవేణి అశోక్, నలిగేటి సతీశ్ పాల్గొన్నారు. అలాగే ఒకటో వార్డు గడ్డిగానిపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి రజతోత్సవ సభ వాల్ రైటింగ్ చేశారు.