హనుమకొండ, సెప్టెంబర్ 26: అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించానని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(భీమ్ రావ్ అంబేద్కర్) తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన ఉదయం దినపత్రిక వరంగల్‌లోని కరీమాబాద్ పూర్వపాత్రికేయులు ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్‌ను హనుమకొండ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం దినపత్రిక మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్, వరంగల్ ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసరి కృష్ణారెడ్డి, ప్రెస్ క్లబ్ హనుమకొండ అధ్యక్షులు వేముల నాగరాజు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఉదయం పాత్రికేయునిగా గడించిన అనుభవంతో తాను ప్రభుత్వ ఉద్యోగం పొంది అంచలంచెలుగా ఎదిగి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయకళాశాలలో ప్రొఫెసర్ పదవిని చేపట్టానన్నారు. ప్రొఫెసర్‌గా తాను ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో జరిగిన సెమినార్లో పాల్గొని అనుభవం గడించాక, ఆ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయ క్షేత్రంలో ప్రవేశించానన్నారు. 2015లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైనా నిరుత్సాహపడలేదని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లోతప్పకుండా ఎంపీగా పోటీ చేస్తానన్నారు.
తాను ఎంపీగా గెలిస్తే పాత్రికేయులందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు. త్వరలో రాష్ర్టంలో రథయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పేద కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదిగాడన్నారు. వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రొఫెసర్ వినోద్‌కుమార్ బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శిగా నిలవాలని, నిస్వార్ధంగా సేవలందిస్తూ యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కన్నా పరశురాములు మాట్లాడుతూ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలబడాలని సూచించారు.