హనుమకొండ, నవంబర్ 3: ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ పౌరహక్కుల సంఘం 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో వేల ఎకరాలను బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీలను దోచిపెట్టేందుకు సిద్ధమైందని ఆరోపించారు. అందరూ ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకించాలని, జీవించే హక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
మధ్య భారతదేశంలోని ఆదివాసుల అణిచివేతను వ్యతిరేకిద్దామన్నారు. ఆదివాసుల హక్కుల చట్టాలు 1/70, పీసా, అటవీ హక్కుల చట్టాన్ని ఆదివాసీ ప్రాంతాలైన 5వ షెడ్యూల్ ప్రాంతాలలో అమలుపర్చాలని డిమాండ్ చేశారు. నక్సల్బరీ, శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటాలు, నాటి ఉద్యమాలపై రాజ్యం అణిచివేత, నిర్బంధం, బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ, ప్రశ్నిస్తూ 1973లో ఏర్పడిన పౌరహక్కులసంఘం నేటికి 53 సంవత్సరాలుగా అదేస్ఫూర్తితో పని చేస్తుందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.నారాయణరావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు బి.జయంత్, ప్రధాన కార్యదర్శి బి.సారంగపాణి, పి.రమేశ్చందర్, ప్రజాఫంట్ నాయకురాలు బి.రమాదేవి, కళావతి, డాక్టర్ రాజమౌళి పాల్గొన్నారు.