వేలేరు : హనుమకొండ జిల్లా వేలేరు మండల మాజీ జడ్పీటీసీ చాడ సరితా రెడ్డి రాజకీయ ప్రస్థానం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళ నాయకురాలిగా ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్న చాడ సరితా రెడ్డి రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడ్డ నూతన వేలేరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించింది. అనంతరం అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వేలేరు మండల అభివృద్ధి కార్యక్రమాలలో జడ్పీటీసీగా కీలకపాత్ర పోషించారు. కాగా, గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం మృతి చెందింది.
సోమవారం ఉదయం ఆమె స్వస్థలం వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో అశ్రునయనాల మధ్య సరితారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె పార్థివదేహనికి బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, వొడితేల సతీశ్ బాబు, అరూరి రమేష్, రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ జడ్పీచైర్మన్ సుధీర్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కూడా మాజీ ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ గుండ్రేడ్డి రాజేశ్వర్ రెడ్డి, తదితరులు నివాళులు అర్పించారు.