విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నచూపు చూస్తున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా పాఠశాలల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడం విస్మయం గొల్పుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రారంభం నాటికే నిర్వహణ నిధుల(కాంపోజిట్ గ్రాంట్)ను ఆయా పాఠశాలలకు రెండు విడుతల్లో విడుదల చేసేది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు.
ఫలితంగా నిర్వహణ కష్టంగా మారుతున్నది. పాఠశాలలకు అవసరమైన రిజిస్టర్లు, రికార్డులు, చాక్‌పీసులు, ప్రయోగశాలల సామగ్రి, తదితర స్టేషనరీ సామగ్రిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అప్పు చేసి కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేగాక క్రీడల నిర్వహణ నిధులు కూడా విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. రేపు, మాపు అంటూ సర్కారు కాలయాపన చేస్తుండడంతో విద్యాబోధన ప్రశ్నార్థకంగా మారుతోంది.
– జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)/గిర్మాజీపేట/హనుమకొండ చౌరస్తా/మహబూబాబాద్
విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల చేయాలి. వాటితోటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, బడిబాట, పాఠశాలలకు అవసరమైన రిజిస్టర్లు, రికార్డులు, టీచింగ్ డైరీలు, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, విద్యార్థులకు నిర్వహించే పరీక్షా సామగ్రి, చాక్‌పీస్‌లు, బోర్డులు, దినపత్రికలు, విద్యుత్ బిల్లులు, ఇతర అవసరాలను వెల్లదీయాల్సి ఉంటుంది.
కానీ ఇప్పటివరకు నిధులు విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయులు, హెచ్ఎంలు సొంత డబ్బులతో బోధన, నిర్వహణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు మౌలిక వసతుల మధ్య విద్యాబోధన చేస్తూనే, వారిలో క్రీడా సామర్థ్యాలను కూడా పెంచాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వం ఏటా క్రీడా నిధులు విడుదల చేయాలి. వాటిని కూడా నేటివరకు ఇవ్వలేదు. పంద్రాగస్టుకు నిర్వహించే క్రీడాపోటీల ఖర్చులు, బహుమతులు కూడా చేతినుంచే పెట్టాల్సి వచ్చిందని పలువురు ఉపాధ్యాయులు, హెచ్ఎంలు వాపోయారు.
పాఠశాలల నిర్వహణకు సంబంధించి డిటేయిలింగ్ ప్రొసీడింగ్స్ వచ్చాయని రెండు, మూడు రోజుల్లో నిధులు మంజూరు అవుతాయని వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1 నుంచి 8 తరగతుల వరకు ఉన్న 425 పాఠశాలల్లో కాంపోజిట్ గ్రాంట్‌కు రూ.88 లక్షలు, క్రీడలకు రూ.24.6 లక్షలు మొత్తం రూ.1.12 కోట్లు, అలాగే 131 సెకండరీ పాఠశాలలకు కాంపోజిట్ గ్రాంట్లకు రూ.54.15 లక్షలు, క్రీడలకు రూ.32.75 లక్షలు కలిపి మొత్తం రూ.86.90 లక్షలకు గాను ప్రొసీడింగ్స్ వచ్చాయని చెబుతున్నారు.
2024-25 విద్యాసంవత్సరానికి పాఠశాలల నిర్వహణకు సుమారు రూ.1.42 కోట్లు, క్రీడలకు రూ.57.35 లక్షలు కలిపి సుమారు రూ.1.99 కోట్లు ప్రొసీడింగ్స్ వచ్చాయని, ఇందులో 50శాతం నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నదని చెబుతున్నారు. హనుమకొండ జిల్లాలోని 542 పాఠశాలలకు సంవత్సరానికి గాను రూ.3.68 కోట్లు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ మంజూరు కావాల్సి ఉండగా మొదటి విడత కింద రూ.1.76 కోట్లు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
రంభమై నాలుగు నెలలుగా గడుస్తున్నా స్కూల్ గ్రాంటును విడుదల చేయని ప్రభుత్వం కంటి తుడుపుగా నిధులు విడుదల చేస్తున్నట్లు ఒక ప్రొసీడింగ్ మాత్రం విడుదల చేసింది. నిధులు మాత్రం విడుదల కాలేదు. భూపాలపల్లి జిల్లాలో 334 ప్రైమరీ, 84 సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. 339 ప్రైమరీ పాఠశాలలకు 100శాతం గ్రాంటు కింద స్కూల్ గ్రాంట్ రూ.60 లక్షలు, స్పోర్ట్స్ గ్రాంట్ రూ.19.25 లక్షలు విడుదల కావాల్సి ఉంది.
అలాగే 84 సెకండరీ పాఠశాలలకు స్కూల్ గ్రాంట్ కింద రూ.32.50 లక్షలు, స్పోర్ట్స్ గ్రాంట్ కింద రూ.21 లక్షలు విడుదల కావాల్సి ఉంది. అయితే పాఠశాలలు పునఃప్రారంభంలో 50శాతం గ్రాంట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తే ప్రధానోపాధ్యాయులు పాఠశాల నిర్వహణకు ఉపయోగిస్తారు. కాగా జిల్లాకు 50శాతం గ్రాంట్ కింద రూ.66.85 లక్షలు ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. మూడు రోజుల క్రితం మాత్రం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రొసీడింగ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. 1 నుంచి 30మంది విద్యార్థులు ఉంటే రూ.10వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ. 25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50వేలు, 251 నుంచి వెయ్యి మంది వరకు ఉంటే రూ.75 వేలు, వెయ్యమందికి పైగా ఉంటే రూ.లక్ష ప్రతి సంవ్సతరానికి విడుదల చేస్తుంది. అలాగే క్రీడల కోసం ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.10వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.10వేలు అందిస్తుంది. పాఠశాలల గ్రాంట్స్ మంజూరు ఆలస్యం విషయంలో, జాడలేని క్రీడానిధులతోపాటు ఇతర విషయాలపై మాట్లాడేందుకు కూడా హెచ్ఎంలు, టీచర్లు భయపడుతుండడం గమనార్హం.
జూన్‌లోనే గ్రాంట్(50శాతం) విడుదల కావాల్సి ఉంది. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలైనా స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ విడుదల కాకపోవడంతో సొంత డబ్బులతో స్టేషనరీ కొనుగోలు చేసి చదువులు చెబుతున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించకపోవడంతో పారిశుధ్య పనులు ఆగిపోయాయి. దీంతో ఉపాధ్యాయలు, మేము డబ్బులు జమ చేసి ఒకరిని నియమించుకొని పనులు చేయిస్తున్నాం. గ్రాంట్ రిలీజ్ అయినట్లు ప్రొసీడింగ్ మాత్రమే వచ్చింది. డబ్బులు మాత్రం అకౌంట్లలో పడలేదు. వెంటనే రిలీజ్ చేయాలి. స్కావెంజర్లను నియమించాలి.
– ఎల్.లక్ష్మీప్రసన్న, జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపాల్, భూపాలపల్లి
ప్రభుత్వ పాఠశాలో కనీస వసతు లు లేక విద్యార్థు లు అవస్థలు పడుతున్నారు. ప్రభు త్వం ఇచ్చిన హామీలను అమలు చే యడం లేదు. స్కూల్ గ్రాంట్ విషయమై అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు, అప్పుడు అని కాలయాపన చేస్తున్నారు. విద్యార్థులకు చార్ట్‌లు, మ్యాప్‌లు తీసుకొద్దామంటే స్కూల్ అకౌంట్లో డబ్బులు లేక హెచ్ఎంలు భరించాల్సి వస్తోంది. పాఠశాలలో కనీస సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలి. అప్పుడే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. సర్కారు ఆలస్యం చేయకుండా వెంటనే స్కూల్ గ్రాంట్‌ను ఖాతాలో జమచేయాలి.
– పులి దేవేందర్, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ట్రెజరీ