Kuravi | కురవి : మండలం గుండ్రాతిమడుగు(విలేజ్)లో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం, దూడల ప్రదర్శన నిర్వహించారు. మండల పశువైద్యాధికారి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేవలం ఆడదూడలు పుట్టే.. లింగ నిర్ధారణ చేసిన సెక్స్ సార్టెడ్ సేమెన్ అందుబాటులో ఉందని.. దీనని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భకోశం ఎదగకపోవడంతో కొన్ని పశువుల్లో మొదటి ఎద వయసు వచ్చినా సరే ఎదకు రాకుండా ఉంటాయన్నారు. గర్భకోశం ఎదగకపోవడం సైతం ఒక కారణం కావచ్చన్నారు. పశువులు ఎదకు రాకపోతే వైద్యులకు చూపించి గర్భకోశం ఎదుగుదల పరీక్షలు చేయించి.. తగిన చికిత్సలు చేయించాలన్నారు. కొన్ని పశువులు నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఆరు నెలలు చూడు గర్భస్రావాలు జరుగుతాయని.. దీనికి గర్భకోశ వ్యాధులు కారణం కావచ్చని వివరించారు.
మూడు నెలల గర్భం ప్రతిసారి పోతుంటే వైద్యునికి చూపించాలని సూచించారు. ట్రైకోమనియోసిస్ అనే వ్యాధి వల్ల ఇలా గర్భం నిలవకపోవడం జరుగుతుందన్నారు. ఆరు నెలలు గర్భం స్రావం బ్రూసిల్లోసిస్ అనే వ్యాధి వల్ల జరిగే అవకాశం ఉందని, ఇవి రెండూ అంటువ్యాధులేనన్నారు. పశువులు ఈనిన తర్వాత 3 నుంచి 24 గంటల్లోపు మాయ వేయకపోతే తప్పనిసరిగా చికిత్స చేయించాలని తెలిపారు. గర్భకోశ వ్యాధుల్లో ముఖ్యమైనది ఎండోమైట్రైసిస్ అని, ఈ వ్యాధి ఉన్న పశువులు త్వరగా ఎదకు రావని, తొందరగా కట్టకుండా తిరిగి ఎదకు వస్తాయన్నారు. గర్భకోశం నుంచి చీములాగా స్రావం వస్తుంది. తగు జాగ్రత్తలతో పాటు చికిత్స చేయించాలన్నారు. శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరంలో జేవీఓ ఎ రేవతి, వీఏ సంధ్య , మహబూబాబాద్ ఏరియా గోపాలమిత్ర సూపర్ వైజర్ కరిమిళ్ల రఘువీర్, గోపాలమిత్రులు భూక్యా భాస్కర్, పిట్టల కృష్ణ, పశుమిత్ర సుజాత, పాడి రైతులు పాల్గొన్నారు.