హనుమకొండ సబర్బన్, మే 29 : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా ఉన్నాయి. అన్నదాతల సంక్షేమానికి గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకానికి ప్రస్తుతం సర్కార్ మంగళం పాడుతున్నది. అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో ప్రోత్సహించిన ఉద్యాన పంటల సాగుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరి వేసేలా వ్యవహరిస్తున్నది. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల సాగును భారీగా పెంచాలని వేదికలపై ఫోజులు కొడుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇందుకు అవసరమైన బిందు సేద్యాన్ని బంద్ పెట్టే పనిలో పడ్డారు.
ఉద్యాన పంటల సాగును గత ప్రభుత్వం ప్రోత్సహించింది. అనేక రకాలుగా సబ్సిడీలు అందించి రైతులకు అండగా నిలిచింది. ఈ పంటల సాగుకు డ్రిప్ తప్పనిసరి. తక్కువ నీరున్నా డ్రిప్‌తో దిగుబడి భారీగా పెరుగుతుంది. దీనికోసం గతంలో రైతులను ప్రోత్సహించేందుకు కేంద్రం 30 శాతం , రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులు సమకూర్చేవి. రైతులు కేవలం 10శాతం చెల్లిస్తే డ్రిప్ మంజూరయ్యేది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాటాను కాస్తా రెట్టింపు చేసింది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే వాటా విషయంలో ఎలాంటి మార్పు లు లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సబ్సిడీని తగ్గించింది. దీంతో ఇటు ఒక ఎకరానికి అయ్యే ఖర్చులో 20శాతం రైతు వాటాగా చెల్లిస్తేనే డ్రిప్ మంజూరవుతుం ది. దీంతో రైతులపై భారీగా ఆర్థిక భారం పడనుంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా రైతులు ఉద్యాన పంటలకు దూరమయ్యే అవకాశాలున్నాయి. గతంలో ఎకరా డ్రిప్ పరికరాల కోసం కేవలం రూ.17 వేలు చెల్లిస్తే సరిపోయేది. అలాంటిది ఇప్పుడు రూ. 34వేలు చెల్లించాల్సి వస్తున్నది. ఒకేసారి వందశాతం పెంచడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే ప్రక్రియలో భాగంగా గతంలో ఉచితంగానే డ్రిప్ సౌకర్యం కల్పించేవారు. ఈ పథకం వల్ల అనేక మంది దళిత రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లీ, అనేక విజయాలు సాధించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు లేక చదువుకున్న పిల్లలు సైతం వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి తరుణంలో దళితులకు ఉచిత డ్రిప్ సౌకర్యాన్ని ఎత్తివేస్తే చాలా మంది ఉద్యాన పంటలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేకాకుండా కొత్త రైతులు వ్యవసాయం వైపు అడుగు వేయాలంటనే భయపడే పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ప్రభుత్వం అనేక మార్గాలు అన్వేషించినా, కూలీల కొరత, ఆర్థిక భారం వల్ల రైతులు వరి వైపే మొగ్గు చూస్తున్నారు. ఈ తరుణంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండి, మన దేశంలో ఉన్న పామాయిల్ కొరతను గుర్తించారు. ఇందుకు మనం కూడా ఆయిల్‌పామ్ పంటను భారీగా సాగు చేసి దేశ ఆర్థిక ప్రగతికి దోహద పడడంతో పాటు రైతులకు సాగు నష్టాలు కలుగకుండా చూడొచ్చనే ఉద్దేశంతో భారీగా సబ్సిడీలు ప్రకటించి ఆయిల్‌పామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 3లక్షల ఎకరాల వరకు ఆయిల్‌పామ్ పంట సాగులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఇది 8 లక్షల వరకు పెంచే ప్రణాళికతో ముందుకు సాగింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆయిల్‌పామ్ రైతులకు కూడా డ్రిప్‌నకు సంబంధించిన సబ్సిడీ వాటాను పెంచడంతో ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది.
గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ వల్ల రాష్ట్రంలో భారీ ఎత్తున రైతులు బిందుసేద్యంలో భాగంగా 11 లక్షల ఎకరాల వరకు ఉద్యాన పంటలను సాగు చేశారు. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే కూరగాయల దిగుమతికి కొంత మేర అడ్డుకట్టపడింది. ప్రస్తుతం డ్రిప్ పరికరాలే కాదు.. ఎరువుల కూడా భారం రైతులపై పడనుంది. గతంలో 25కిలోల 20-20-20 బ్యాగు రూ. 5400 ఉంటే, ఇది కాస్తా ఇప్పుడు రూ. 5900కు పెరిగింది. 12-61-0 రూ.6800 ఉంటే, 7500 అయింది. 13-0-45 రూ. 5900 ఉంటే, 6300 అయింది. 0-52-34 రూ.7300 ఉంటే రూ.8,600 అయింది. 0-0-50 రూ.4500 ఉన్నది కాస్తా రూ.5వేలకు పెరిగింది. కాల్షియం 25 కిలోల బస్తా రూ.2800 ఉంటే ఇప్పుడు అది రూ.3400కు పెరిగింది. దీంతో ఉద్యాన రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లోకి వస్తున్న చిన్నతరహా కంపెనీలు తక్కువ ధరకు డ్రిప్ ఎరువును ఇస్తామంటూ నకిలీ మందులను ఇచ్చి రైతులకు కుచ్చుటోపి పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.