పర్వతగిరి, మార్చి 5: పర్వతగిరి ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చందా శోభారాణి -రమేష్ దంపతులు 80 వేల రూపాయల విలువ గల స్కూలు బ్యాగులను(School bags) బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి జి లింగారెడ్డి హాజరై మాట్లాడారు. దానగుణం కలవారు నిజమైన ధనవంతులన్నారు. శోభారాణి పర్వతగిరి పాఠశాలలో పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి సమాజంలోని సంపన్నులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ వెంకటరమణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు ఏ మనోహర్, డాక్టర్ ఎం భాస్కర్, డి రాధాకృష్ణకుమారి, ఏ తిరుమల, పరశురాములు, పి అనిల్ కుమార్, ఎం రాజలక్ష్మి పాల్గొన్నారు.