రోడ్డు ప్రమాదాలు నలుగురి కుటుంబాల్లో విషాదం నింపాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
టేకుమట్ల/శంకరపట్నం, డిసెంబర్ 16 : కారును లారీ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకర్‌పట్నం మండలం తాటికల్ శివారులో శనివారం తెల్లవారుజామున జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఎంపెడు గ్రామానికి చెందిన మాడగొని శ్రావణ్(28) ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన కారులో హైదరాబాద్ నుంచి వేములవాడ రాజన్న సన్నిధికి ఓ కుటుంబంతో కిరాయికి శుక్రవారం వెళ్లాడు. అక్కడ ఆ కుటుంబాన్ని దింపి, పార్కింగ్ చేసి వస్తానని చెప్పి, హనుమకొండలో ఉంటూ చదువుకుంటున్న పెద్దంపల్లి గ్రామానికి చెందిన తన బావమరిది బొల్లికొండ ఆకాశ్(20) వద్దకు వెళ్లాడు. శనివారం తెల్లవారు జామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఆకాశ్‌తోపాటు పెద్దంపల్లి గ్రామానికి చెందిన మరో యువకుడు పైడిపల్లి రాకేశ్‌తో కలిసి వేములవాడుకు కారులో తిరిగి వస్తున్నాడు.
ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో వీరి కారును కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న శ్రావణ్, ఆకాశ్ అక్కడికక్కడే మృతి చెందారు. పైడిపెల్లి రాకేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కేశవపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి, హుజూరాబాద్ దవాఖాన మార్చురీకి తరలించారు. గాయపడిన రాకేశ్‌ను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల్లో శ్రావణ్‌కు వివాహం కాగా, చిన్న కుమారుడు ఉన్నాడు. కాగా, చేతికందిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలను ఎంపీపీ రెడ్డిమల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్ల రవి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కోటగిరి సతీశ్, సర్పంచ్ కొలిపాక రాజయ్య, నాయకులు ఆది రఘు, కొయ్యల చిరంజీవి, గంధం సారయ్య పరామర్శించారు.