ఐనవోలు, అక్టోబర్ 5 : ‘మీ ఇంటి బిడ్డను.. ముచ్చటగా మూడోసారి ఆశీర్వదించండి.. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల వ్యాప్తంగా 14 గ్రామాల్లో రూ.49.9 కోట్లతో అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయంలో ఎల్లమ్మ ఆల య పునర్నిర్మాణం, రేకుల షెడ్డు నిర్మాణం, కల్యాణ కట్ట, పున్నేల్ క్రాస్ వద్ద ఆర్చి, కోనేరు, కల్యాణమండపం, అద్దాల మండపం, ఆఫీసు బిల్డింగ్ పనులను డీసీసీబీ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. అలాగే, బతుకమ్మ చీరెలు, కేసీఆర్ క్రీడా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే అరూరికి మహిళలు, గ్రామస్తులు, నాయకులు కోలాటలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లాడుతూ గత పాలకుల హయాంలో మన గ్రామం, మన ప్రాంతం ఎలా ఉండేది? ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలా ఉందో కండ్ల ముందు కనిపిస్తోందన్నారు. ప్రజలే ఆలోచించి అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వాన్ని ఆశ్వీదించాలని కోరారు. 70 ఏళ్ల పాలనలో చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తామని కొందరు వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొత్త సీసాలో పాత మందు అన్నట్లుగా మళ్లీ వస్తున్నారన్నారు.
ఇతర రాష్ర్టాలో అధికారంలో ఉన్న ఆయా పార్టీలో అక్కడ అమలు చేయని పథకాలను తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామని నమ్మబలుకుతున్నారన్నారు. వీరి తీరు కూట్లే రాయి తీయ్యనోడు.. ఏట్లే రాయి తీస్తానని చెప్పినట్లు ఉందన్నారు. ముందు ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేసిన తర్వాతే తెలంగాణలో చేస్తామని హామీ ఇస్తే బాగుటుందని హితవు పలికారు. మరింత అభివృద్ధి జరగాలంటే ముచ్చటగా ముడోసారి ఎమ్మెల్యేగా అరూరి రమేశ్, సీఎంగా కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సంపత్‌కుమార్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, వైస్ ఎంపీపీ మోహన్, ఈవో నాగేశ్వర్రావు, సొసైటీ వైస్ చైర్మన్లు చందర్రావు, జిల్లా ఆత్మ కమిటీ డైరెక్టర్లు రాజులు, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రవీందర్, సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాస్, కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.