కాజీపేట, జూలై 26: కేంద్రబడ్జెట్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు 16మంది పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హక్కులను సాధించేవరకు పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల్లో నిధుల కేటాయింపులో వివక్ష, విభజన చట్టంలోని హామీల విస్మరణపై శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోయినిపల్లి హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టంలోని హామీలను విస్మరిస్తున్నాయన్నారు. అన్ని అర్హతలు ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.
ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో వరంగల్ అనేక పరిశ్రమలతో ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. విభజన చట్టంలోని హామీలను సాధించేవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. పులిలా ఉన్న మోదీ మూడోసారి ఎన్నికల్లో పిల్లిలా మారిపోయారని, మిత్రపక్షాలైన టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ ఎంపీల చేతుల్లో కీలుబొమ్మగా పాలన సాగుతోందని ఆరోపించారు. ఆంధ్రా సీఎం చంద్రబాబునాయుడు అనేక ప్రాజెక్టులను తీసుకువెళ్లాడని, వెనుకబడిన జిల్లాల పేరుతో పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేసుకున్నారన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి నిధులను తీసుకురాలేదని, బీజేపీ తెలంగాణకు రూపాయి నిధులను కేటాయించలేదన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడం బీజేపీ తెలంగాణ, వరంగల్‌పై చూపుతున్న వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్రంపై కాంగ్రెస్, బీజేపీలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని మండిపడ్డారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమంలో వామపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు కలిసి రావాలని కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకూ పోరాటం ఆపబోమని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, ఇండ్ల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్, దిడ్డి భాగ్య-కుమారస్వామి, జోరిక రమేశ్, మరుపల్లి రవి, బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు శిమరుల్ల దశరథం, గబ్బెట శ్రీనివాస్, కాటాపురం రాజు, జనార్దన్‌గౌడ్, పాలడుగులశివకుమార్, తేలు సారంగపాణి, బస్వ యాదగిరి, సంచు అశోక్, నయిం జుబేర్ పాల్గొన్నారు.