హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మున్సిపాలిటీల విలీనంపై దాఖలైన పిటిషన్లలో ప్రభుత్వం తమ వాదనను తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపాలిటీల విలీనానికి అనుసరించిన విధానం ఏమిటో తెలియజేయాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సమీపంలోని 26 మున్సిపాలిటీలను విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 26 మున్సిపాలిటీలను విలీనం చేయడంపై సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలన్నది. మున్సిపాలిటీల విలీనానికి వీలుగా ప్రభుత్వం మున్సిపల్ చట్టానికి తీసుకువచ్చిన సవరణలను సవాల్ చేస్తూ రంగారెడ్డి జల్లా తకుగూడ మండలం రావిర్యాలకు చెందిన ఆర్. లక్ష్మణ్ వేసిన రెండు పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై కౌంటర్లు దాఖలు చేయాలంది. ఈ మేరకు మున్సిపల్ శాఖను ఆదేశించింది. విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.