బూర్గంపహాడ్, జూలై 25 : పారిశ్రామికవాడ సారపాకలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక స్టాక్ పాయింట్లపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. సారపాక పంచాయతీ పరిధిలోని గాంధీనగర్, భాస్కర్‌నగర్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమార్కులు అర్ధరాత్రులు ఇసుక రవాణా చేస్తూ ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక స్టాక్ పాయింట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నా వీటి సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంబంధిత రెవెన్యూ, మైనింగ్ శాఖలు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వర్షాకాలం సీజన్ కావడంతో గోదావరి నుండి అక్రమంగా ఇసుకను తీసుకువచ్చి స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని ఆ ఇసుకను ట్రాక్టర్‌కు రూ.3 వేల నుండి రూ.4 వేల వరకు అమ్ముకుంటున్నారనేది బహిరంగ సత్యం. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే సారపాక పంచాయతీలోని పలు కాలనీల్లో తనిఖీలు చేపడితే స్టాక్ పాయింట్లకు సంబంధించి 600 ట్రిప్పుల వరకు ఇసుకను సీజ్ చేయొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి ఇసుక స్టాక్ పాయింట్లను గుర్తించి సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.