ములుగు, (నమస్తేతెలంగాణ)/తాడ్వాయి,సెప్టెంబర్ 28 : ప్రకృతిని మానవుడు ఎదిరించలేడనడానికి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో గత నెల 31న జరిగిన ప్రకృతి విపత్తుతో రుజువైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అడవి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. మేడారం అటవీ ప్రాంతంలో ధ్వంసమైన భారీ వృక్షాలను అటవీ శాఖ మాజీ డీఎఫ్‌వో, జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. మేడారంలో చోటుచేసుకున్న ఉపద్రవం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని అన్నారు. మంత్రి కొండా సురేఖ కేంద్ర ప్రభుత్వ కంపా నిధుల కోసం లేఖ రాయాలన్నారు. మంత్రి సీతక్క నేలకూలిన అడవిని కాపాడేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలన్నారు. ప్రకృతిపై ప్రతి ఒక్కరికీ ప్రేమ ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. 1500 ఎకరాల్లో 50 వేల నుంచి 80 వేల వృక్షాలు నేలకూలాయని, అవి మళ్లీ పెరిగే వరకు ప్రజలు సంచరించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన తెలంగాణ ఎంపీలు కంపా నిధులను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలను నాటామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అది అటకెక్కిందని తెలిపారు. టోర్నడోను మించిన విపత్తు సంభవించి వేలాది ఎకరాల్లో ఎన్నో ఏళ్ల నాటి భారీ వృక్షాలు, చెట్లు పై నుంచి కింది వరకు చీలిపోయాయన్నారు. తుఫాను కారణంగా సుడిగాలులు రెండు వైపులా ఒకే సమయంలో వచ్చి ఇంతటి ఉపద్రవం చోటు చేసుకుందన్నారు. ఇప్పటికైనా మానవులంతా ప్రకృతిపై ప్రేమను చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాడ్వాయికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపి త్వరగా అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు.
ధ్వంసమైన అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా 500 మీటర్ల చొప్పున మనుషులు ప్రవేశించకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేనట్లయితే ఈ ప్రాంతం కబ్జాకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు. అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించేందుకు సహజ సిద్ధమైన మొక్కలను నాటడంతో పాటు ఐదు సంవత్సరాల పైబడిన చెట్లను తీసుకొచ్చి ప్లాంటేషన్ చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న రాష్ట్రంలో నేడు ప్రకృతి కూడా ఒక భాగమైందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోవింద్‌నాయక్, ఇతర నాయకులు ఉన్నారు.