చిల్పూరు, మార్చి 13 : మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసు లు అడ్డుకున్నారు. శుక్రవారం బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండగా దానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి వస్తున్నట్లు తెలుసుకున్న రాజయ్యతో పాటు జనగామ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేశ్‌రెడ్డి, మండల కో ఆర్డినేటర్ జనగామ యాదగిరి, మారెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్‌బాబు, రంగు హరీశ్, స్థానిక నాయకులు ఆయనకు బీఆర్ఎస్ తరపున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు సన్మానించేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో ఆలయం వద్దకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే జనగామ రూరల్, రఘునాథపల్లి సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట ఎస్సై రాజు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రాజయ్యకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కండువా కప్పుకొని గ్రామాల్లోకి వస్తేనే ప్రజలు, నాయకులు స్వాగతం పలుకుతారని, లేదంటే తరిమి కొడతారని అన్నారు. కారు గుర్తుపై గెలిచిన శ్రీహరి తక్షణమే తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయానికి మాజీ సీఎం కేసీఆర్ గత పదేళ్లలో రూ. 10కోట్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు కడియం తట్టెడు మట్టికూడా తీయలేదన్నారు. ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం పోలీసుల భద్రత మధ్య నిర్వహించడం సిగ్గుచేటన్నారు. 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే కడియం చిల్పూరు మండలంలో ఏ పనులు చేపట్టాడో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల నాయకులు మరపాక రమేష్, నారగోని రాజు గౌడ్, నారగోని రవిచంద్ర, గడ్డమీది మహేందర్, శాగ వెంకటేశ్వర్లు, మోటం రాములు, తాళ్లపళ్లి క్రాంతికుమార్ పాల్గొన్నారు.