నెల్లికుదురు/ గూడూరు/ కేసముద్రం, అక్టోబర్ 9 : అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆరోపించారు. పథకాల ఆశ చూపి ప్రజలను మోసం చేసిన ఆ పార్టీ స్థానిక ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరు, నెల్లికుదురు, కేసముద్రం మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలకు ఆయన కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హమీలిచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ శ్రేణులను అన్ని వర్గాల ప్రజలు నిలదీసేందుకు బాకీ కార్డు బ్రహ్మాస్ర్తాలుగా ఉపయోగపడతాయన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే ముందుండగా, ప్రస్తుతం అట్టడుగు స్థాయికి చేరుకుందన్నారు.
నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు గెలుచుకొని అధినేత కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని శ్రేణులకు శంకర్‌నాయక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నెల్లికుదురు, కేసముద్రం బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పరుపాటి వెంకట్‌రెడ్డి, మహ్మద్ నజీర్, ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనివాస్, మాజీ జడ్పిటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, మాజీ ఏఏంసీ చైర్మన్ నీలం దుర్గేశ్, మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, నాయకులు ఎర్రబెల్లి నవీన్‌రావు, పులి రామచంద్రు, ఎండీ రహమాన్, బత్తిని అనిల్, బానోత్ భీముడు, అశ్విన్, మురళి, ప్రశాంత్, రమేశ్, భోజ్యా, కొండ్రెడ్డి రవీందర్‌రెడ్డి, కమటం శ్రీనివాస్, లింగాల పిచ్చ య్య, వీరునాయక్ తదితరులు పాల్గొన్నారు.