కురవి, జూన్ 08: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన తొడుసు నేహశ్రీ (15) శనివారం సాయంత్రం మండల కేంద్ర శివారు లింగ్యాతండా వద్ద 365 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆ ప్రమాదంలోనే గాయపడిన తల్లి సరిత అపస్మారక స్థితిలోకి చేరగా వైద్యుల సలహా మేరకు ఖమ్మం దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన కురవి గ్రామాన్ని విషాదంలో ముంచింది. కుమార్తె నేహ మృతిచెందిన వార్త తెలియగానే తండ్రి వెంకన్న కూడా ఆపస్మారకస్థితిలోకి చేరడంతో ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొంది.
అటు తల్లి సరిత కుమార్తెను కడచూపుకు కూడా నోచుకోలేదు. కనీసం తల్లికి కుమార్తె మరణ వార్త కూడా తెలియదు. ఆదివారం నిర్వహించిన అంత్యక్రియలకు గ్రామస్తులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరై కన్నీటి వీడ్కోలు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ కావల్సిన నేహశ్రీ చిన్న వయస్సుల్లోనే ఆకస్మికంగా మృతిచెందడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ బాలిక నేహశ్రీ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. నేహాశ్రీకి నివాళులు అర్పించాడు. తండ్రిని ఓదార్చి తల్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బజ్జారి పిచ్చిరెడ్డి, తోట లాలయ్య, నాగయ్య, గుగులోత్ రవి, నూతక్కి నర్సింహారావు, సాంబశివరావు, మేక నాగిరెడ్డి, దుర్గెల వినోద్ తదితరులు పాల్గొన్నారు.