వేలేరు : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు, రైతుల సమస్యల పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య( Former MLA Rajaiah ) పాదయాత్ర చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) పేర్కొన్నారు.
వేలేరు, చిల్పూర్, తరిగొప్పుల మండలాల రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో వేలేరు నుంచి గండిరామారం వరకు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేపడుతున్న పాదయాత్ర ( Padayatra ) ను ఆదివారం వేలేరు మండల కేంద్రంలో దాస్యం వినయ్ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం నాడు ప్రజల్లో ఉద్యమ స్పూర్తి, పట్టుదల, ఉత్సాహం నేడు తెలంగాణ శ్రేణులలో కనిపిస్తుందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ని చూసి స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ని గెలిపిస్తే పార్టీకి ద్రోహం చేసి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని నిస్సహాయక స్థితిలో ఉన్నాడని విమర్శించారు. త్యాగాలకు కేరాఫ్‌గా రాజయ్య ఉంటే అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ కడియం శ్రీహరి అని ఎద్దేవా చేశారు. ఘన్పూర్ ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) రూ.104 కోట్లతో సాగునీటి పనులకు శంకుస్థాపన చేసారని, ఆ పనులు పూర్తయితే పార్టీకి, కేటీఆర్‌కు మంచి పేరొస్తుందనే పనులను కడియం శ్రీహరి అడ్డుకుంటున్నారని విమర్శించారు. పాదయాత్ర వేలేరు నుంచి శాలపల్లి, పీచర, మద్దెలగూడెం, చిల్పూర్ మండలం కొమ్ముగుట్ట, లింగంపల్లి, ఫతేపూర్, మీదుగా గండిరామారం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, జడ్పీ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ మారపాక రవి, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మండల ఇన్చార్జి భూపతి రాజు, పాదయాత్ర ఇన్చార్జి మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కర్ర సోమిరెడ్డి, ఆకుల కుమార్ తదితరులు పాల్గొన్నారు .