జనగామ, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) : నీ ఎమ్మెల్యే పదవి మా బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టిన భిక్ష..అలాంటి పార్టీకి డిపాజిట్ రాదనడం విడ్డూరం అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలపై ఆయన జనగామ జిల్లా రఘునాథపల్లిలో శుక్రవారం ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరి కట్లపాము లాంటివాడని.. మొన్నటికి మొన్న డివిజన్ బెంచ్, కోర్టులకు వెళ్తా అని ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎదురొంటానంటూ పూటకో మాట మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.
కేసీఆర్ ఏ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కండువా కప్పలేదని, రేవంత్‌రెడ్డి నీ ఇంటికి వచ్చి కండువా కప్పిండని అన్నారు. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి రేవంత్‌రెడ్డి మాటలకు విలువ ఇస్తాడా? రాజ్యాంగానికి విలువ ఇస్తాడా? చూడాలన్నారు. కేసీఆర్‌ది అవినీతి పాలన అయితే 10 ఏండ్లు పకనే ఉన్న నీ వాటా ఎంత? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది 9 నెలలు గడిచినా నియోజకవర్గానికి ఒక రూపాయి తీసుకురాలేదన్నారు. ఎన్నికలు వస్తే అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కడియంను ఓడించడమే లక్ష్యం గా పెట్టుకున్నారని, ఉపఎన్నికలు రావంటూనే బీఆర్ఎస్కు డిపాజిట్ దక్కదంటూ మతిభ్రమించి మాట్లాడుతున్న కడియం తన పదవికి రాజీనామా చేయాలని రాజయ్య డి మాండ్ చేశారు.
దేవాదులకు ద్రోహం చేసింది ముమ్మాటికి కడియం శ్రీహరే అన్నారు. ఘనపురం అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. ఏడు రిజర్వాయర్లతో మూడు పంటలు పండించేంత అభివృద్ధి జరిగిందని, చెక్‌డ్యాంలు కట్టి, భూగర్భ జలాలు పెంచుకున్నామని, సోనియా, వైఎస్‌కు వ్యతిరేకంగా నీళ్లు విడుదల చేయొద్దని అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి శ్రీహరి అని ధ్వజమెత్తారు. 25వేల జనాభాతో ఏర్పడే ఘనపురం మున్సిపాలిటీని ఆనాడు అడ్డుకున్నది కూడా కడి యం శ్రీహరేనని రాజయ్య పేర్కొన్నారు.