కాటారం, ఏప్రిల్ 22 : ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని అణచివేసేందుకు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మంథని నియోజవకవర్గంలోని వల్లె కుంటకు తీసుకొచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ నేడు కాటారం మండలం నస్తూర్పల్లిలో సీఎం రేవంత్‌రెడ్డితో మీటింగ్ పెట్టి ఉద్యమ నేత కేసీఆర్‌ను తిట్టించారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. బుధవారం కాటారం మండలకేంద్రంలో జడ్పీ మాజీ చైర్ పర్సన్ జకు శ్రీహర్షిణీ రాకేశ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. నస్తూర్పల్లిలో ప్రజాపాలన పేరుతో నిర్వహించిన మీటింగ్ కాటారం మండలాన్నే అపవిత్రం చేసిందన్నారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి గొంతెత్తి మాట్లాడితే గొప్పగా అనుకుంటున్నాడేమో గానీ, ఆయన మాటలు విని సమాజమంతా అసహ్యించుకుందన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ రాసిన గ్యారెంటీ కార్డులో నాలుగే ఉన్నాయా అని ప్రశ్నించారు. అందులో మహిళలకు రూ.2,500, రైతులకు రూ.15వేలు, కౌలు రైతులకు ఇస్తమన్నవి ఏవి అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో మూడేళ్లకు 3 వేల ఇండ్లు మంజూరు చేశారని, అవి కూడా ఎన్నికలు వచ్చిన సమయంలోనే ఓట్ల కోసం ఇచ్చారని విమర్శించారు. సీమాంధ్రుల చెప్పులు మోసిన రేవంత్‌రెడ్డి ఆనాడు ఉద్యమకారులను తుపాకులతో బెదిరించిన విషయం ఇంకా ప్రజలు మర్చిపోలేదన్నారు.
కాళేశ్వరం కూలిపోయిందని, పనికిరాదని మాట్లాడిన సీఎం అదే కాళేశ్వరం మీదుగా కాన్వాయ్‌లో ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వస్తున్నాడంటే ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించడమో, ఏదైనా పరిశ్రమను తీసుకురావడమో జరుగుతుంది. కానీ, ఇకడ మాత్రం కేవలం కేసీఆర్‌ను తిట్టాలనే ఆలోచనతోనే మీటింగ్ పెట్టారన్నారు. నియోజకవర్గంలో అనేక వనరులున్నాయని, వాటిని ఉపయోగించుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకశాలు కల్పించాలనే ఆలోచన ఎమ్మెల్యే శ్రీధర్‌కు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మానేరుపై వంతెనకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, ఆ పనులు ఎన్నడు మొదలవుతాయో అర్థం కావడంలేదన్నారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించకపోతే ఈనాడు రేవంత్‌రెడ్డి సీఎం, శ్రీధర్ మంత్రిగా ఉండేవాడా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పలు మండలాల అధ్యక్షులు జోడు శ్రీనివాస్, మార రాముగౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రావు, నియోజకవర్గ అధ్యక్షురాలు గీత, సర్పంచ్‌లు పంతకాని సడవలి, ఊర వెంకటేశ్వర్రావు, నాయకులు తోట జనార్దన్, జకు శ్రావణ్, శ్రీపతిబాపు, బొడ్డు రాజబాపు, గాలి సడవలి, కొండగొర్ల వెంకటస్వామి, నరివెద్ది శ్రీనివాస్, అయిలి రాజబాబు, దుర్గారావు, బాలరాజు, రమేశ్, ప్రమోద్, విక్రమ్, మురహరి, మనోహర్, ప్రశాంత్, మున్వార్, లక్ష్మీనారాయణ, సమ్మయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.