మహదేవపూర్(కాటారం), డిసెంబర్ 6 : ఏడాదిలో ఏం సాధించిందని కాంగ్రెస్ విజయోత్సవాలు నిర్వహిస్తున్నదని మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రశ్నించారు. కాంగ్రెస్ వంచన దినాల్లో భా గంగా శుక్రవారం కాటారంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలిచ్చి వాటిని విస్మరించి ప్రజలను మోసం చేసిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పోరాటంతోనే కొద్దో గొప్పో రుణ మాఫీ చేశారని, లేకుంటే అది కూడా చేసేవారు కాదని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లు ప్రజలకు రక్షణగా లేవని, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెపితేనే దరఖాస్తులు తీసుకుంటున్నారని, వాళ్లకు పైలట్లు, ఎస్కార్ట్లు పెట్టేందుకే అవి పనిచేస్తున్నాయని విమర్శించారు. సీఎం సభ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేసి పెద్దపల్లిలో భారీ సభ పెట్టి రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నరని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు.