హనుమకొండ, జూలై4: ‘కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ భయాందోళనకు గురిచేస్తోంది. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. న్యాయ పోరాటం చేస్తాం. పార్టీ శ్రేణుల జోలికి వస్తే ఖబర్దార్ అని’ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ హెచ్చరించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పి ప్రతీకార పాలన చేస్తుందని అన్నారు. ఆరు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టుకుందని, ఇచ్చిన హామీలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని పేర్కొన్నారు.
హామీలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులపై అభాండాలు, ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఒక నెల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, మరో నెల విద్యుత్ అవినీతని, ఇంకో నెల టెలిఫోన్ ట్యాపింగ్ అని, తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు కేటాయించిన స్థలాలపై మాట్లాడుతూ హామీలను తాత్సారం చేస్తున్నదని దాస్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు బీఆర్ఎస్ కార్యాలయాలకు వస్తున్నారని, దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఆఫీసులను కూల్చివేయాలని చూస్తున్నదని ఆరోపించారు. నగరంలోని సర్వే నంబర్ 1066లో ఎకరం భూమిని బీఆర్ఎస్ పార్టీ రూ. 4,84,000కు ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేసి పార్టీ కార్యక్రమాలకు వాడుతుందన్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఈ భూమిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పంపిన నోటీసుకు వివరణ ఇచ్చామని తెలిపారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కక్షపూరితంగా వ్యవహరించలేదని, నాయిని లాంటి ఎమ్మెల్యేను చూడలేదన్నారు.
పార్టీ కార్యాలయం కూల్చే కుట్ర: మాజీ ఎమ్మెల్యే పెద్ది
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చే కుట్ర చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఇటుక పెళ్ల కదిపినా గాంధీభవన్ కూల్చడమే కాకుండా జిల్లా కార్యాలయాలను టచ్ చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆంధ్రాబ్యాంకుకు, కరీంనగర్ జిల్లా ఆఫీసును పెళ్లిళ్లకు కిరాయికి ఇస్తున్నారని, ఖమ్మంలో కమర్షియల్‌గా వాడుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు చెన్నం మధు, బోయినపల్లి రంజిత్‌రావు, నల్ల స్వరూపారాణి, ఇమ్మడి లోహిత, పార్టీ సీనియర్ నాయకులు జానకిరాములు, నయీముద్దీన్, బండి రజిని కుమార్, పరశురామ్, పోలెపల్లి రామ్మూర్తి, విద్యార్థి సంఘం నాయకులు బైరపాక ప్రశాంత్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.