శాయంపేట, ఏప్రిల్ 15 : ఊరూరూ ఉప్పెనలా మారాలని, ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. మహాసభ విజయవంతానికి గులాబీ సైనికులు కృషి చేయాలన్నారు. మంగళవారం శాయంపేట మండలంలోని హుస్సేన్‌పల్లి, పత్తిపాక, ప్రగతిసింగారం, అప్పయ్యపల్లి, నేరేడుపల్లి, నూర్జహాన్‌పల్లి, కాట్రపల్లి, కొప్పుల, వసంతాపూర్, గంగిరేణిగూడెం, సూర్యనాయక్‌తండా,సాధన్పల్లి, రాజుపల్లి గ్రామాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
మాందారిపేట నుంచి హుస్సేన్‌పల్లి వరకు బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ పద్నాలుగేళ్లు ఉద్యమంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని, నాడు ఆంధ్ర నాయకులతో కలిసి చంద్రబాబునాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ముందుకొచ్చిన కేసీఆర్ ప్రజల సహకారంతో కొట్లాడి రాష్ర్టాన్ని సాధించారన్నారు. పదేళ్ల తన పాలనలో కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కరెంటు, తాగునీళ్ల సమస్య పోయిందన్నారు.
రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి తదితర అనేక పథకాలు అమలు చేసి దేశానికే రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారన్నారు. అసత్య ప్రచారాలు, అనేక హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలనలో విఫలమైందన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే తమకు మేలు జరుగుతుందన్న భావన ప్రజల్లో నెలకొందన్నారు. జూన్ వరకు స్థానిక ఎన్నికలు రావొచ్చని, గులాబీ పార్టీలో కష్టపడే నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికకావచ్చన్నారు.
బీఆర్ఎస్ మీటింగ్‌కు పోతే సంక్షేమ పథకాలు అందవని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం ఏమీ ఇచ్చే స్థితిలో లేదని, మళ్లీ కేసీఆర్ వచ్చాకే పథకాలు అందుతాయని ప్రజలకు చెప్పాలని శ్రేణులకు సూచించారు. ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని, ఐదు, పది మందికి కూడా వచ్చే పరిస్థితి లేదని, దీంతో లిస్టును బయటకు రానివ్వడం లేదన్నారు.
ఇందిరమ్మ ఇండ్లపై ఆర్టీఐ యాక్టు ద్వారా వివరాలు తీసుకుంటానని, కాంగ్రెసోళ్లు పప్పు పుట్నాల్లా పంచుకుంటే బయట పడుతుందని గండ్ర అన్నారు. సమావేశాల్లో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గంటా శ్యాంసుందర్‌రెడ్డి, దూదిపాల తిరుపతిరెడ్డి, మారెపల్లి నందం, కొమ్ముల శివ, దైనంపెల్లి సుమన్, పసుల ప్రవీణ్, అరికిల్ల ప్రసాద్, గాజె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.