మడికొండ, మార్చి 30 : కాంగ్రెస్, బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. కాజీపేట మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణను 10 ఏళ్లలోనే దేశానికే అన్నం పెట్టే విధంగా తీర్చిదిద్దారని చెప్పారు. అనేక ప్రాజెక్టులు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారన్నారు. రైతులకు విద్యుత్, ఎరువులు, నీళ్ల కొరత లేకుండా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 రకాల పథకాలు, 6 గ్యారెంటీలను ఇంకా అమలు చేయడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రకృతి సహజంగా కరువు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే కరువును సృష్టిస్తోందన్నారు. పంటలకు నీరందక ఎండుతున్నాయని, దీంతో రైతు ఆత్మహత్యలు పునరావృతం అవుతున్నాయన్నారు. మహాలక్ష్మీ పథకం ఆటోడ్రైవర్లకు కష్టాలు తెచ్చి పెట్టిందని, వారి సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధును రెట్టింపు చేయాలని కోరారు. పార్టీ మారినోళ్లను చెప్పులు, రాళ్లతో కొట్టాలని రేవంత్‌రెడ్డి పలు సభల్లో చెప్పారని, ఇప్పుడేమో బీఆర్ఎస్ను లేకుండా చేయాలని చోటేభాయ్, బడేభాయ్ మిలాఖత్ అయ్యారని ఆరోపించారు.
అవకాశవాదులు, స్వార్థపరులు పార్టీని వీడినా ఓరుగల్లులో బీఆర్ఎస్ ఎదిగేందుకు శ్రేణులు కృషి చేయాలన్నారు. ఏప్రిల్ ఒకటిన మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ సుధీర్‌బాబు హాజరవుతారని చెప్పారు.
బీఆర్ఎస్లో సరైన నాయకత్వం లేదని, అంతర్గత విభేదాలు లేనిపోని మాటలు చెప్పేందుకు కడియం శ్రీహరికి సిగ్గుండాలని మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్ అన్నారు. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన కడియం శ్రీహరి కూతు రు కావ్య పార్టీకి కేడర్ లేదని బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌తో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారమే ఈ నాటకం ఆడినట్లు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
పార్టీ కోసం ఎప్పుడూ పనిచేయలేదని, ప్రతిపక్షంలోకి వెళ్లిన వెంటనే అధికార పార్టీ గుర్తొస్తుందంటే 40 ఏళ్ల అనుభవం ఏమైందని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటూ రాజకీయ లబ్ది పొందారే తప్ప ఒక ఎస్సీ సర్పంచ్‌ను, జడ్పీటీసీని, ఎంపీటీసీని ఎమ్మెల్యే స్థాయి నాయకుడిగా తయారు చేయలేదన్నారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ సంకు నర్సింగ్, నాయకులు నార్లగిరి రమేశ్, మహమూద్, శంకర్, చందర్, సుంచు కృష్ణ, మర్యాల కృష్ణ, గబ్బెట శ్రీనివాస్, అఫ్జల్, ఎండీ సోని, రామ్మూర్తి పాల్గొన్నారు.