మహదేవపూర్, మే 24 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు నాలుగో రోజు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి ప్రజలు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలాచరించారు. అనంతరం కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయంలో పూజలు చేశారు.
అద్వైతానంద భారతి, శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురువులు, శంకరాచార్య మహాసంస్థానం స్వాములతో పాటు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వారు ధర్మాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కాగా, సుమారు 30 వేల మందికిపైగా భక్తులు కాళేశ్వర క్షేత్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
