రాయపర్తి : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఐత వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli) మంగళవారం మృతుడి నివాసానికి చేరుకొని వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకన్న మరణానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకుని మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మండల కేంద్ర పరిధిలోని గుబ్బడి తండాలో గిరిజనులు జరుపుకుంటున్న తమ ఇలవేల్పు దుర్గామాత ఉత్సవాలకు ఆయన హాజరై తండావాసులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తండావాసులతో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అనునిత్యం భగవంతుడి యెడల భక్తి ప్రపత్తులతో ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో ఆలయాల నిర్మాణం వల్ల ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందుతుందన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు అయిత రామ్ చందర్, చిన్నాల రాజబాబు, బందెల బాలరాజు, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్ యాదవ్, మైసా వెంకటేశం, గుగులోతు శ్రీనివాస్, దేవేందర్ నాయక్ తదితరులున్నారు.