వర్ధన్నపేట, జూలై 28: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మండలంలోని ఇల్లంద శివారు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నేతలు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. రైతులందరికీ రూ.2లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.లక్షలోపు మాత్రమే మాఫీ చేశారని పేర్కొన్నారు.
ఇందులో కూడా 50 శాతం మంది అర్హులైన రైతులకు రుణమాఫీ జరగకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ఇవే మాఫీ చేయలేని ప్రభుత్వం రూ.2లక్షల వరకు పంట రుణాలను ఏవిధంగా మాఫీ చేస్తుందని విమర్శించారు. దీనికి తోడుగా 200ల యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించుకునే పేదలకు అనేక కొర్రీలు పెట్టి ఉచిత విద్యుత్‌ను అమలు చేయడం లేదని అన్నారు. దీనికి తోడుగా పేదలకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని కాంగ్రెస్ సర్కారు ఎక్కడా అమలు చేయడంలేదని వివరించారు.
ఈ విషయాలను ప్రజలకు సమగ్రంగా వివరించి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను ముందుండి తీరుస్తానని వివరించారు. సమావేశంలో పార్టీ నాయకులు మార్గం భిక్షపతి, గుజ్జ సంపత్‌రెడ్డి, సిలువేరు కుమారస్వామి, తుమ్మల యాకయ్య, ఎండీ రహీమ్, మాధవరావు, కంజర్ల రవి, మహేశ్, కొండేటి శ్రీనివాస్, ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.