జనగామ, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను దగా చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జనగామ సమీకృత కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ పాలకుర్తి మండలం తొర్రూరు (జే) డ బుల్ బెడ్రూం లబ్ధిదారులు, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ సర్కార్ గుంజుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పార్టీలకతీతంగా గ్రామసభలో అధికారులే అభ్యర్థులను ఎంపిక చేశారని, ఇందులో అందరూ పేదలే అని అన్నారు. వారికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. పేదలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే వారి పక్షాన పోరాడుతామని, న్యాయం జరిగే వరకు కొట్లాడుతామని స్పష్టం చేశారు. తొర్రూరు (జే) డబుల్ బెడ్రూం బాధితులకు అండగా ఉంటానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.