హనుమకొండ చౌరస్తా, నవంబర్ 17: కాంగ్రెస్ పాలనలో రోజురోజుకూ రాష్ట్రంలో ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చక ఇప్పటికే రైతన్నలను మోసం చేసిందన్నారు. లగచర్ల ఘటన బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సన్నకారు రైతుల భూములు గుంజుకుని ఏమైనా చేస్తానంటే తెలంగాణ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తుందన్నారు.
రేవంత్‌రెడ్డి సొంత జిల్లా, నియోజక వర్గ రైతులు, ప్రజలు కాంగ్రెస్ సరారుకు వ్యతిరేకంగా తిరగబడ్డారని అన్నారు. రేపు రాష్ట్రం మొత్తం రేవంత్ సరారుపై తిరగబడుతుందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పేరిట తులం బంగారం, మహిళలకు రూ.2500 హామీలు, లగచర్ల ఘటనపై తొందర్లోనే కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.