హసన్‌పర్తి, ఏప్రిల్ 26 : కొమ్మాల జాతరలాగా రజతోత్సవ సభకు రైతులు, కార్యకర్తలు తరలిరావాలని వర్ధన్నపేట ఇన్చార్జి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. గ్రేటర్ ఒకటో డివిజన్ పరిధిలోని పెడగపల్లి క్రాస్ రోడ్డు నుంచి ఎర్రగట్టు వద్దకు ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో శనివారం ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు.
ముఖ్యఅతిదిగా దయాకర్‌రావు హజరైయ్యారు. మహిళలు బతుకమ్మలతో కోలాటాలతో డీజే సప్పుల్లతో ఎర్రబెల్లికి స్వాగతం పలికారు. అనంతనం మహిళలతో కలిసి ఎర్రబెల్లి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం ఎడ్లబండి నడుపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర సాధనే ఏకైక మార్గమని భావించి, ఉవ్వెత్తున్న ఉద్యమాన్ని నడిపించి, చివరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రం సాధించిన మహావ్యక్తి కేసీఆర్ కొనియాడారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. మాయమాటలతో గద్దెనెక్కిక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ప్రతి గ్రామం నుంచి రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో తరలివచ్చి కేసీఆర్‌కు మద్దతు పలకడం కోసం రైతులు దండు కడుతున్నారని, వారు నడిపే ఎడ్లబండ్ల సప్పుడుకే కాంగ్రెసోళ్లకు వణకు పుట్టాలన్నారు. ఇప్పుడికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు వంద సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు కుమార్‌యాదవ్, భూక్యా సాంబయ్యనాయక్, శ్రీను, శ్రీధర్, ప్రమోద్ పాల్గొన్నారు.