దేవరుప్పుల/హసన్‌పర్తి, ఏప్రిల్ 14 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కార్యకర్తలు కదంతొక్కాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాలని, ఊరూవాడా కదిలిరావాలన్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్తో పాటు హనుమకొండ చింతగట్టులోని బీజీఆర్ గార్డెన్లో నిర్వహించిన గ్రేటర్ వరంగల్ 55, 56, 65 డివిజన్ల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన ఛలో వరంగల్ పిలుపును నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం ర్యాలీగా తరలిరావాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి 20 వేల మంది హాజరవుతారని అనుకుంటున్నప్పటికీ ఆ సంఖ్య పెరుగుతుందన్నారు. ఇక దేవరుప్పుల మండలం నుంచి 5 వేల మంది తరలివస్తారని శ్రేణులే చెబుతున్నారని అన్నారు.
ఈ సభతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలిసిపోతుందని, ఇప్పటికే అనేక సర్వేల్లో ఆ పార్టీ అట్టడుగులో ఉండగా, పాలకుర్తిలో బీఆర్ఎస్ హవా నడుస్తున్నదన్నారు. పాలకుర్తిలోఎక్కడ చూసినా కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలవుతున్నా అభివృద్ధి శూన్యమన్నారు.
బీఆర్ఎస్ పాలనలో వేగంగా అభివృద్ధి
తెలంగాణ సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడి అవసరాలు తెలిసిన వ్యక్తిగా రైతులకు సా గు నీరు, కరెంటు, ప్రజలకు మిషన్ భగీరథతో తాగు నీరు, మిషన్ కాకతీయతో చెరువు ల మరమ్మతు చేపట్టడంతో పాటు అనేక జలాశయాలు నిర్మించారన్నారు. విద్య, ఉపాధి కల్పనతో పాటు అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలతో అన్నదాత కుటుంబాలు సుభిక్షంగా ఉన్నాయన్నారు.
ప్రస్తుత సీఎం రే వంత్‌రెడ్డి 16 నెలల పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రజతోత్సవ సభ అనంతరం పార్టీలో నూతనోత్సాహం వస్తుందని, కొత్త సభ్యత్వాలు తీసుకోవడంతో పాటు, పార్టీ అన్ని విభాగాల్లో నూతన కమిటీలు వేస్తారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, నా యకులు పల్లా సుందరరాంరెడ్డి, వీరారెడ్డి దామోదర్‌రెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, ఏల సుందర్, బస్వ మల్లేశ్, కారుపోతుల భిక్షపతి, ధరావత్ రాసింగ్, చింత రవి, గాంధీనాయక్, ఈదునూరి నర్సింహారెడ్డి, కత్తుల విజయ్‌కుమార్‌రెడ్డి, మైదం జోగేశ్వర్, కోతి ప్రవీణ్, వంగ అర్జున్, అంతోజు కృష్ణమూర్తి, కుతాటి నర్సింహులు, 65వ డివిజన్ కార్పొరేటర్ గుగులోత్ దివ్యరాణీరాజునాయక్, పలు డివిజన్ల అధ్యక్షులు భూక్యా సాంబయ్యనాయక్, అటికం రవీందర్, నాయకులు భూపాల్, పాడి మల్లారెడ్డి, విక్టర్‌బాబు, సూరం వాసుదేవరెడ్డి, శంకర్, శ్రీనివాస్, లక్ష్మణ్, మైఖేల్ రాజు, నాగరాజు పాల్గొన్నారు.