సంగెం, ఆగస్టు 24 : ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ఈ నెల 30 వరకు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తిలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు.
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నాటకమాడుతున్నదని. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి, ప్రమాణం చేసి మాయమాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల ముందు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకున్నాడని, ఇప్పుడు మాఫీ చేయకుండా రైతులను మోసం చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగస్టు 15 వరకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, 40శాతం మందికి కూడా చేయలేదని విమర్శించారు. పొరపాటు చేశామని మంత్రులు కూడా ఒప్పుకున్నారని అన్నారు. రైతులను బాగుచేసిన మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, సీఎం హుందాగా వ్యవహరించాలన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ తీసుకుంటున్నాడని అన్నారు. కాళేశ్వరం, దేవాదుల నీళ్లు లేవని, 24 గంటల కరెంటు ఇస్తలేరని, ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేశామని ప్రజలు తలలు పట్టుకుంటున్నట్లు తెలిపారు.
అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతులతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో గాల్లో గెలిచిన ఎమ్మెల్యేకు ఏ ఊరు ఎక్కడుందో ఇప్పటివరకు తెలియదని, ఆయన రైతుల గురించి ఎందుకు పట్టించుకుంటడనని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావొస్తున్నా గెలిచిన ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఎంత మంది రైతులు ఏయే బ్యాంకుల్లో ఎంత మేరకు రుణాలు తీసుకున్నారో తెలియదా? అని ప్రశ్నించారు. కాపులకనపర్తి సొసైటీలో 1907 మంది రైతుల్లో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదన్నారు.
అదే సొసైటీలో పేరాల సాంబయ్య అనే రైతు రూ. లక్ష చెల్లిస్తే రసీదు ఇచ్చారు కానీ బ్యాంకులో జమచేయలేదని, అందుకు కారకులైన చైర్మన్, సీఈవో, ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి,నాయకులు దొనికెల శ్రీనివాస్, సంగెం సొసైటీ చైర్మెన్ వేల్పుల కుమారస్వామి, కాపులకనపర్తి సొసైటీ వైస్ చైర్మన్ ముడిదె శ్రీనివాస్, సుతారి బాలకృష్ణ,సోల్తి భూమాత, నర్సింహస్వామి, గోవర్ధన్‌గౌడ్, కత్తెరపెల్లి దామోదర్, ఉండీల రాజు, దోపతి సమ్మయ్య, పెంతల అనిల్, వీరాచారితో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.